Loading...
Andhra Pradesh: పదో తరగతి సమ్మెటివ్‌-1 పరీక్షల పర్యవేక్షణకు ప్రత్యేక పరిశీలకులు
పదో తరగతి సమ్మెటివ్‌-1 పరీక్షల పర్యవేక్షణకు ప్రత్యేక పరిశీలకులు

Andhra Pradesh: పదో తరగతి సమ్మెటివ్‌-1 పరీక్షల పర్యవేక్షణకు ప్రత్యేక పరిశీలకులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2026
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి సమ్మెటివ్‌-1 పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేపట్టింది. పరీక్షలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు తొలిసారిగా పాఠశాల స్థాయి పరీక్షలకు ప్రత్యేక పరిశీలకులను నియమించింది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలకు,పాఠశాలల్లో నిర్వహించే పరీక్షల ఫలితాలకు మధ్య వ్యత్యాసం కనిపిస్తుండటంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సమ్మెటివ్‌-1 పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పరీక్షల పర్యవేక్షణ కోసం మొదటి మూడు రోజులు నిర్వహించే భాషా సబ్జెక్టులకు భాషేతర సబ్జెక్టుల స్కూల్‌ అసిస్టెంట్లను పరిశీలకులుగా నియమించారు. అలాగే భాషేతర సబ్జెక్టుల పరీక్షల సమయంలో భాషా సబ్జెక్టుల ఉపాధ్యాయులకు ఈ బాధ్యతలు అప్పగించారు.

వివరాలు 

పరిశీలకులుగా పొరుగు మండలాలకు చెందిన ఉపాధ్యాయులు 

వీరు పరీక్షల నిర్వహణతోపాటు జవాబు పత్రాల మూల్యాంకనం, లీప్‌ యాప్‌లో విద్యార్థుల మార్కుల నమోదును కూడా పర్యవేక్షించనున్నారు.

పరిశీలకులుగా పొరుగు మండలాలకు చెందిన ఉపాధ్యాయులను నియమించాలని తొలుత నిర్ణయించారు.

అయితే, కొన్ని ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు 15 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తోందని ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.

దీంతో ప్రత్యేక పరిస్థితుల్లో సంబంధిత మండల పరిధిలోని ఉపాధ్యాయులనే పరిశీలకులుగా నియమించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులకు (డీఈఓలకు) అవకాశం కల్పించారు.

పరిశీలకులు తమకు కేటాయించిన విధులకు హాజరవుతున్నారా? లేదా? అనే విషయాన్ని తనిఖీ చేసే బాధ్యతను జిల్లా నోడల్‌ అధికారులకు అప్పగించారు.

వివరాలు 

వారం రోజుల్లో మూల్యాంకనం, మార్కుల నమోదు

పరీక్ష పూర్తయిన తర్వాత మూడు పని దినాల్లోగా సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు తమ పాఠశాలలోనే జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలి.

అనంతరం ప్రతి విద్యార్థికి వచ్చిన మార్కులను రిజిస్టర్‌లో నమోదు చేయాలి.

మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలు, మార్కుల రిజిస్టర్లను ప్రధానోపాధ్యాయుడి ఆధీనంలో ఉంచాలి.

మూల్యాంకనం పూర్తయిన నాలుగో రోజున అదే సబ్జెక్టుకు చెందిన మరో పాఠశాల ఉపాధ్యాయుడిని పరిశీలకుడిగా నియమిస్తారు.

ఆయన జవాబు పత్రాల మూల్యాంకన విధానాన్ని పరిశీలించడంతోపాటు మొత్తం జవాబు పత్రాల్లో 5 శాతం లేదా కనీసం ఐదు పత్రాలను తనిఖీ చేయాలి.

ఈ పరిశీలనలో ఎలాంటి లోపాలు లేకపోతే లీప్‌ యాప్‌లో విద్యార్థుల మార్కులను నమోదు చేస్తారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రక్రియను ఏడు రోజుల్లోగా పూర్తి చేయాలి: విద్యాశాఖ

ఈ మొత్తం ప్రక్రియను ఏడు రోజుల్లోగా పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.

పరిశీలనలో గుర్తించిన అంశాలతో అదే రోజు మండల విద్యాశాఖ అధికారులకు (ఎంఈఓలకు) నివేదిక సమర్పించాలి.

పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, జవాబు పత్రాల తనిఖీ, లీప్‌ యాప్‌లో మార్కుల నమోదు.. ఇలా ప్రతి సబ్జెక్టుకు విడివిడిగా గడువులను నిర్ణయించారు.

సమ్మెటివ్‌-1 పరీక్షలు ఈ నెల 18న ముగియనున్న నేపథ్యంలో, సంబంధిత పరీక్షలు, మూల్యాంకనం సహా అన్ని ప్రక్రియలను ఈ నెల 27వ తేదీలోగా పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ADVERTISEMENT