AP Assembly: ఆగస్టు 15 తర్వాత అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ప్రభుత్వం సన్నాహాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆగస్టు 15 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. వర్షాకాల సమావేశాలను శాసనసభ, శాసనమండలికి కలిపి నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. సమావేశాలను ప్రారంభించి సెప్టెంబరు తొలి వారంలోగా ముగించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. గత బడ్జెట్ సమావేశాలు ముగిసి సెప్టెంబరు తొలి వారానికి ఆరు నెలలు పూర్తికానున్న నేపథ్యంలో, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆ లోపు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. అయితే, అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం ఆమోదించేందుకు మార్చి 28న శాసనసభను ప్రత్యేకంగా ఒక రోజు సమావేశపరిచారు. దీంతో ఆ సమావేశాన్ని పరిగణనలోకి తీసుకుంటే సెప్టెంబరు 28 వరకు అసెంబ్లీని సమావేశపర్చేందుకు అవకాశం ఉంది.
వివరాలు
సెప్టెంబరు తొలి వారంలోనే ముగించేలా కార్యాచరణ
అయినప్పటికీ, ప్రతి ఏడాది మాదిరిగానే వర్షాకాల సమావేశాలను ఉభయ సభలకు నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆగస్టు 15 తర్వాత సమావేశాలు ప్రారంభించే దిశగా కసరత్తు చేస్తోంది.
వీటిని సెప్టెంబరు తొలి వారంలోనే ముగించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఏర్పాట్లకు సమయం తక్కువగా ఉండటంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సోమవారం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో సమావేశాల నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
అనంతరం సీఆర్‌డీఏ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన, అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న క్వార్టర్ల పనుల పురోగతిని సమీక్షించి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.