Andhra News: పోలవరం,మార్కాపురం కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. రాష్ట్రంలో 28 జిల్లాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో జిల్లాల పునర్విభజనకు సంబంధించి కీలక నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పోలవరం, మార్కాపురం అనే రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఇదే సమయంలో అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూనే జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చే ప్రతిపాదనకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్సార్ కడప జిల్లాలోకి, రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోకి విలీనం చేయాలని నిర్ణయించారు. అయితే రాయచోటి నియోజకవర్గం మాత్రం అన్నమయ్య జిల్లాలోనే కొనసాగనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కేబినెట్ విస్తృతంగా చర్చించి తుది ఆమోదం తెలిపింది.
వివరాలు
ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలోకి.. మూడు మండలాలతో గూడూరు రెవెన్యూ డివిజన్..
కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటు కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని రెండు భాగాలుగా విభజించాలని నిర్ణయించింది. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరును వాసవీ పెనుగొండగా మార్చనున్నారు. అలాగే గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాలను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలిపారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు, బాపట్ల జిల్లా నుంచి అద్దంకి నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో విలీనం కానున్నాయి. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలతో పాటు పలు మార్పులు, చేర్పులపై ఈ నెల 31న తుది నోటిఫికేషన్ జారీ చేయనుండగా, జనవరి 1 నుంచి కొత్త పాలన అమల్లోకి రానుంది. ఈ మార్పులతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది.
వివరాలు
రెవెన్యూ డివిజన్లలో మార్పులు, చేర్పులివే
ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు రెవెన్యూ డివిజన్‌లోనూ మార్పులు చేశారు. గూడూరు, చిల్లకూరు, కోట మండలాలతో కూడిన గూడూరు రెవెన్యూ డివిజన్‌ను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి మార్చారు. ఈ డివిజన్‌లో మిగిలిన వాకాడు, చిట్టమూరు మండలాలను సూళ్లూరుపేట డివిజన్‌లోకి, బాలాయపల్లె, డక్కిలి, వెంకటగిరి మండలాలను శ్రీకాళహస్తి డివిజన్‌లోకి చేర్చనున్నారు. కలువాయి మండలాన్ని ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌లోకి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు డివిజన్‌లోనే కొనసాగించనున్నారు. ఇతర జిల్లాల రెవెన్యూ డివిజన్లలో కూడా పలు మార్పులు చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్‌లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డివిజన్‌లోకి విలీనం చేయనున్నారు.
వివరాలు
టెక్కలి డివిజన్‌లోకి నందిగాం గ్రామం
కందుకూరు రెవెన్యూ డివిజన్‌లోని కొండాపురం, వరికుంటపాడు మండలాలను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి రెవెన్యూ డివిజన్‌లో కలపగా, కందుకూరు డివిజన్‌లో మిగిలిన ఐదు మండలాలను ప్రకాశం జిల్లాలో చేర్చనున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్‌లోని నందిగాం గ్రామాన్ని టెక్కలి డివిజన్‌లోకి మారుస్తారు. సామర్లకోట మండలాన్ని కాకినాడ రెవెన్యూ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్‌లోకి, చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్‌లోకి విలీనం చేయనున్నారు. మునగపాక మండలం అనకాపల్లి డివిజన్‌లోనే కొనసాగనుంది. కనిగిరి రెవెన్యూ డివిజన్‌లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాలను కందుకూరు డివిజన్‌లోకి చేర్చనున్నారు. అద్దంకి నియోజకవర్గంలోని ఐదు మండలాలను బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలోకి మారుస్తారు.
వివరాలు
రంపచోడవరం కేంద్రంగా పోలవరం
పలమనేరు డివిజన్‌లోని బంగారుపాళ్యం మండలాన్ని చిత్తూరు డివిజన్‌లోకి, ఆమడగూరు మండలాన్ని కదిరి డివిజన్ నుంచి పుట్టపర్తి డివిజన్‌లోకి, గోరంట్ల మండలాన్ని పుట్టపర్తి డివిజన్ నుంచి పెనుకొండ డివిజన్‌లోకి చేర్చనున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాల్లో రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పడనుంది. ఇందులో రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌కు చెందిన 8 మండలాలు, చింతూరు రెవెన్యూ డివిజన్‌కు చెందిన 4 మండలాలు కలిపి మొత్తం 12 మండలాలు ఉంటాయి. అలాగే మార్కాపురం కేంద్రంగా మరో కొత్త జిల్లా ఏర్పడనుంది. ఇందులో మార్కాపురం రెవెన్యూ డివిజన్‌కు చెందిన 15 మండలాలు, కనిగిరి రెవెన్యూ డివిజన్‌కు చెందిన 6 మండలాలు కలిపి మొత్తం 21 మండలాలు ఉంటాయి.
వివరాలు
తిరుపతి జిల్లాలోకి రైల్వేకోడూరు నియోజకవర్గం
అన్నమయ్య జిల్లా నుంచి రైల్వేకోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలోకి చేరనుంది. ఈ నియోజకవర్గంలోని కోడూరు, పెనగలూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబులవారిపల్లె మండలాలను తిరుపతి రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేస్తారు. అదే విధంగా నందలూరు, రాజంపేట, వీరబల్లి, టీ.సుండుపల్లి మండలాలతో కూడిన రాజంపేట రెవెన్యూ డివిజన్‌ను వైఎస్సార్ కడప జిల్లాలోకి మారుస్తారు. రాయచోటి, సంబేపల్లి, చిన్నమండ్యం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాలతో కూడిన రాయచోటి రెవెన్యూ డివిజన్ మాత్రం మదనపల్లె కేంద్రంగా ఏర్పడే అన్నమయ్య జిల్లాలోనే కొనసాగుతుంది.
వివరాలు
కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు
కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయనున్నారు. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్ కేంద్రంగా 7 మండలాలతో ఒక డివిజన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి కేంద్రంగా 10 మండలాలతో మరో డివిజన్, అన్నమయ్య జిల్లాలో పీలేరు కేంద్రంగా 8 మండలాలతో డివిజన్, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర కేంద్రంగా 5 మండలాలతో డివిజన్, నంద్యాల జిల్లాలో బనగానపల్లి కేంద్రంగా 5 మండలాలతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటవుతాయి.
వివరాలు
జిల్లా కేంద్రం మదనపల్లెకు మార్పు
కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని ఆదోని-1 (29 గ్రామాలు), ఆదోని-2 (17 గ్రామాలు)గా రెండు కొత్త మండలాలుగా విభజించనున్నారు. అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చనున్నారు. కొత్త అన్నమయ్య జిల్లాలో మొత్తం 24 మండలాలు ఉండగా, మదనపల్లె (11), పీలేరు (8), రాయచోటి (5)గా మూడు రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. ఈ మొత్తం పునర్విభజన ప్రక్రియలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 17 జిల్లాల్లో మార్పులు, చేర్పులు జరిగాయి. మిగిలిన 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.