LOADING...
AP Cabinet: అమరావతి రైతులకు రూ.1.5 లక్షల వరకు రుణమాఫీ.. క్యాబినెట్ కీలక నిర్ణయం
అమరావతి రైతులకు రూ.1.5 లక్షల వరకు రుణమాఫీ.. క్యాబినెట్ కీలక నిర్ణయం

AP Cabinet: అమరావతి రైతులకు రూ.1.5 లక్షల వరకు రుణమాఫీ.. క్యాబినెట్ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2026
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ సుస్థిర అభివృద్ధి దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించిన అనంతరం అజెండాలో ఉన్న 30కిపైగా ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. సమావేశం ముగిసిన తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే లక్ష్యంతో రూ.9,355 కోట్ల వ్యయంతో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పార్థసారథి పేర్కొన్నారు. అలాగే విశాఖపట్నంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడానికి కూడా క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందన్నారు.

వివరాలు 

2026 జనవరి 6కు ముందు తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తిస్తుంది: పార్థసారథి

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.50 కోట్ల నిధులు కేటాయించేందుకు క్యాబినెట్ అంగీకరించిందని తెలిపారు. ఈ క్రమంలో నెల్లూరులోని ఐటీసీ హోటల్, కడపలో మాధవి హోటల్, విజయవాడలోని సరోవర్ పోర్టికో హోటల్‌కు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాజధాని అమరావతిలో రెండో విడత భూసమీకరణలో భూములు ఇచ్చిన ఏడు గ్రామాల రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2026 జనవరి 6కు ముందు తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

వివరాలు 

క్యాబినెట్ తీసుకున్న ఇతర కీలక నిర్ణయాలు

కడపలో ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్‌మెంట్ పార్కు ఏర్పాటుకు ఆమోదం. విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరులో అంబేడ్కర్ గురుకుల సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) ఏర్పాటుకు అనుమతి. ఐఐటీ-జేఈఈ, నీట్ పరీక్షలకు విద్యార్థులకు రెసిడెన్షియల్ కోచింగ్ కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం. పెద్దగెడ్డ రిజర్వాయర్ కమాండ్ ఏరియా ఆధునికీకరణ పనులకు గ్రీన్‌సిగ్నల్. కుప్పంలో ఫీడర్ ఛానెల్స్ అభివృద్ధితో పాటు బీరగానిపల్లె రిజర్వాయర్ పనులకు అనుమతి. సీఆర్‌డీఏ ఆమోదించిన సంస్థలకు భూకేటాయింపులు చేపట్టేందుకు క్యాబినెట్ అంగీకారం.

Advertisement

వివరాలు 

తప్పుడు ప్రచారంపై ప్రభుత్వం కఠిన వైఖరి

సోషల్ మీడియా దుర్వినియోగంపై డీజీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. విదేశాల్లో అమల్లో ఉన్న సోషల్ మీడియా చట్టాలు, భారత సమాచార సాంకేతిక (ఐటీ) చట్టంలోని లోపాలపై మంత్రివర్గంలో విస్తృతంగా చర్చించినట్లు చెప్పారు. మహిళలు, బాలికలను అవమానించే పోస్టులు, వ్యక్తిత్వ హననానికి పాల్పడే ప్రచారం, అలాగే ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి వెల్లడించారు.

Advertisement