Page Loader
Tirupati laddoo row: తిరుపతి లడ్డూ వివాదం.. సాయంత్రంలోపు రిపోర్ట్ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశం!
తిరుపతి లడ్డూ వివాదం

Tirupati laddoo row: తిరుపతి లడ్డూ వివాదం.. సాయంత్రంలోపు రిపోర్ట్ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశం!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 20, 2024
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీవారి లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలు ఉపయోగించిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై ప్రపంచవ్యాప్తంగా భక్తులలో కలిగిన ఆందోళనలు, ఆవేదనను ప్రభుత్వం గమనించింది. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో తిరుమల లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో నాణ్యతా లోపాలు, అపవిత్ర పదార్థాల వినియోగంపై చర్చ జరిగింది.

వివరాలు 

భక్తుల విశ్వాసాలు,ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని చంద్రబాబు హామీ

సీఎం చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్,మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి,నిమ్మల రామానాయుడు,అనగాని సత్యప్రసాద్,కొల్లు రవీంద్ర,కొలుసు పార్థ సారధితో పాటు ఉన్నతాధికారులు తిరుమల అంశంపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి, టీటీడీ ఈవోను..లడ్డూ తయారీలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదికను ఈ రోజు సాయంత్రంలోగా ఇవ్వాలని కోరారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా ఆగమ, వైదిక,ధార్మిక పరిషత్‌లతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. భక్తుల విశ్వాసాలు,ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని ఆయన హామీ ఇచ్చారు. తిరుమల లడ్డూప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఈఅంశానికి సంబంధించిన వివరాలను తెలుసుకుని,నివేదిక ఇవ్వాలని కోరారు.