Pawan Kalyan: తిరుమల లడ్డూపై వివాదం.. సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటుకు డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. 'ఎక్స్'లో ఓ సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ఆయన స్పందించారు. ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పవన్ తెలిపారు. వైసీపీ హయాంలో ఉన్న టీటీడీ బోర్డుకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలనూ దెబ్బతీసిందని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్,ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణ కోసం జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మరక్షణ బోర్డు' ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై అన్ని వర్గాల వారితో జాతీయ స్థాయిలో చర్చ జరగాలని ఆయన చెప్పారు.
నెయ్యిలో భారీగా కల్తీ.. బాధ్యులపై కఠిన చర్యలు
సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చిన, అందరూ కలిసికట్టుగా నిర్మూలించాలని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో టీటీడీ మహాప్రసాదమైన లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటి అంశాలు కలగలసి ఉండొచ్చని గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) కాఫ్ లిమిటెడ్ సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. ఈ నెయ్యిలో భారీగా కల్తీ జరిగిందని, పాలతో సంబంధం లేని ఇతర కొవ్వులు (ఫారిన్ ఫ్యాట్స్) ఉన్నట్లు పరీక్షలు వెల్లడించాయని టీడీపీ పేర్కొంది. ఈ విషయంపై పెద్ద దుమారం రేగుతోంది, దీనిపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.