CM Chandrababu: రాష్ట్రంలో శాంతి భద్రతలకి పోలీసు వ్యవస్తే కీలకం.. అందుకే ప్రక్షాళన.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత కీలకమని, టూరిజం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో పేర్కొన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి రాష్ట్రం చిరునామా కావాలంటే శాంతి భద్రతలు కీలకమని ఆయన చెప్పారు. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని, చట్టాన్ని చేతికి తీసుకుని ఇష్టానుసారంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థకు గౌరవం ఇవ్వడం అవసరమని ముఖ్యమంత్రి సూచించారు.
లా అండ్ ఆర్డర్ పటిష్ఠంగా అమలు
అమరావతిలో 5 ఎకరాల భూమిని పోలీసు మార్టియర్స్ డే కోసం కేటాయిస్తున్నట్లు తెలిపారు. సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. తుళ్లూరులో ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ స్థాపనతో పాటు, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీని కూడా రాష్ట్రానికి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ (ఈగల్)ను ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు. రాజకీయ ముసుగులో నేరాలు చేయాలనుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అమ్మాయిలపై దాడులు చేయాలనుకుంటే దానికే ఆఖరి రోజు అనే భయం ఏర్పడాల్సిన అవసరముందన్నారు. డ్రగ్స్ పై అవగాహన కలిగించేందుకు పెద్ద ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమాజంలో చైతన్యం తీసుకురావడానికి లా అండ్ ఆర్డర్ పటిష్ఠంగా అమలు చేస్తామని చెప్పారు.
ల్యాండ్ గ్రాబింగ్ చేయించిన వారిని ప్రత్యేక కోర్టుల ద్వారా వెంటనే శిక్ష
ల్యాండ్ గ్రాబింగ్‌పై కేసులు వస్తే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ చేయించిన వారిని ప్రత్యేక కోర్టుల ద్వారా వెంటనే శిక్షించి, బాధితులకు పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. విచారణ జిల్లా కలెక్టర్ అనుమతితో పకడ్బందీగా జరుగుతుందని, డీఎస్పీ స్థాయి పై అధికారి దీనిని పరిశీలిస్తారని వివరించారు. పీడీ యాక్ట్‌కు పదును పెట్టామన్నారు. తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని పీడీ యాక్ట్‌లను పరిశీలించినట్లు చంద్రబాబు తెలిపారు. సైబర్ క్రైమ్ నేరస్తులను కూడా పీడీ యాక్ట్ పరిధిలోకి చేర్చామని స్పష్టం చేశారు.