ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఝలక్ ఇచ్చిన స్టాఫ్.. పేషీ సిబ్బందికి 8 నెలలుగా జీతాల్లేవ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీస్ లేటుగా మాత్రమే వస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎనిమిది నెలలుగా అసలు జీతాల ఊసే లేదనే విషయం తాజాగా వెలుగులోకి రావడం గమనార్హం. అయితే మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేషీలో గత నవంబర్ నుంచి ఉద్యోగులకు జీతాలే లేవు. దీంతో చేసేది లేక ఉద్యోగులు సదరు పేషీకి తాళం వేసి ఎంచక్కా ఊరికి వెళ్లిపోయారు. సచివాలయంలోని చెల్లుబోయిన పేషీలో ఏడుగురు సిబ్బంది పని చేస్తున్నారు. అందులో అటెండర్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. వీరికి కాపు కార్పోరేషన్, బీసీ కార్పోరేషన్లు నుంచి జీతాలు వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేషీలో 8 నెలలుగా నో శాలరీస్
సచివాలయంలో పనిచేస్తున్న వారంతా కాంట్రాక్ట్ ఉద్యోగులే. వీరికి కేవలం ఒకటి, రెండు నెలల జీతం కాదు, దాదాపు 8 నెలల వేతనం రావాల్సి ఉంది. ఇప్పటికే జీతాల పరిష్కారంపై అటు మంత్రికి, ఇటు ఓఎస్డీ అధికారికి ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా వినిపించుకోవట్లేదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. సదరు మంత్రి పేషీలో గతేడాది నుంచే ఎవరికీ జీతాలు రావడం లేదట. ఇంకా మౌనం వహిస్తే జీతాలనూ ఎగ్గొట్టినా ఆశ్చర్య లేదని భావించి వెంటనే ఛాంబర్ కు తాళాలు వేసేశామని సిబ్బంది అంటున్నారు. ఈ క్రమంలో సోమవారం మంత్రి ఛాంబర్ ను సిబ్బంది ఓపెన్ చేయలేదు. కారణమేమిటా అని తోటి ఉద్యోగులు ఆరా తీస్తే గానీ తెలియలేదు జీతాలు రాని సంగతి.