AP Govt: ఏపీ ప్రజలకు ఊరట.. కిలో ఉల్లి రూ.35కే.. పప్పు, పామాయిల్ ధరలూ తగ్గింపు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం ఊరటనిచ్చే చర్యలు చేపట్టింది. మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. నిత్యావసరాల ధరల నియంత్రణపై మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ సభ్యులుగా ఉన్న కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మార్కెట్‌లో ధరలు పెరగడానికి కారణాలు, ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు అందించే మార్గాలపై సమావేశంలో చర్చించారు.
వివరాలు
NCCF ద్వారా ఉల్లి సరఫరా
కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF) సహకారంతో అవసరమైన స్థాయిలో ఉల్లిపాయలను రాష్ట్రానికి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వీటిని రైతు బజార్లు, ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా కిలో రూ.35 చొప్పున విక్రయించనున్నారు.
సరఫరా ప్రారంభమైన అనంతరం మార్కెట్‌లో ధరల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించనున్నారు.
వివరాలు
పామాయిల్, కందిపప్పుపైనా ఫోకస్
ఉల్లితో పాటు పామాయిల్, కందిపప్పు ధరలను తగ్గించడంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది.
మార్కెట్ ధర కంటే పామాయిల్‌ను రూ.10 వరకు తక్కువకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
కందిపప్పు ధర తగ్గింపుపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
కందిపప్పు సరఫరా కోసం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నుంచి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కందులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
ఈ కందులను సేకరించి, ప్రాసెసింగ్ చేసిన తర్వాత రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.
వివరాలు
బియ్యం విక్రయాలకు భారీ స్పందన
బియ్యం ధరలను నియంత్రించేందుకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 651 ప్రత్యేక కౌంటర్లు, రైతు బజార్లను ఏర్పాటు చేశారు.
వీటి ద్వారా ఇప్పటివరకు సుమారు 10,163 క్వింటాళ్ల బియ్యాన్ని విక్రయించినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ విక్రయాల ద్వారా లక్ష మందికిపైగా వినియోగదారులు ప్రయోజనం పొందినట్లు పేర్కొంది.
వినియోగదారుల్లో ఆదరణ ఉన్న KNM రకం బియ్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నెల్లూరు జిల్లాలోని రైస్ మిల్లర్ల నుంచి 10,000 మెట్రిక్ టన్నుల KNM బియ్యాన్ని సేకరించి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించనున్నారు.
వివరాలు
అక్రమ నిల్వలపై కఠిన చర్యలు
నిత్యావసర వస్తువులకు కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వ చేయడం వంటి చర్యలను ఉపేక్షించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నిత్యావసర వస్తువుల ధరలు, నిల్వల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నాయి.
మొత్తంగా.. ఉల్లి, కందిపప్పు, పామాయిల్, బియ్యం ధరలను నియంత్రణలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ చర్యలను వేగవంతం చేస్తోంది.
ధరల నియంత్రణకు సంబంధించి త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రులు తెలిపారు.