Visakhapatnam: విశాఖలో ఏపీ గ్లోబల్ ఎంఎస్‌ఎంఈ సదస్సు.. పాల్గొననున్న 16 దేశాల కొనుగోలుదారులు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీని దేశంలోనే ప్రధాన ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో విశాఖపట్టణంలో 'ఏపీ గ్లోబల్ ఎంఎస్‌ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సు'ను నిర్వహిస్తున్నామని ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియా ఎంఎస్‌ఎంఈ ఫోరం సహకారంతో ఈ నెల 9 మరియు 10 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశం జరుగుతుందని వివరించారు. రష్యా,శ్రీలంక,హంగరీ,యునైటెడ్ కింగ్‌డమ్,ఆస్ట్రియా,జపాన్,న్యూజిలాండ్,ఈజిప్ట్,బహ్రెయిన్,నేపాల్, జింబాబ్వే,టాంజానియా,ఉగాండా,కెన్యా తదితర మొత్తం 16 దేశాలకు చెందిన 34 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు ఈ సదస్సుకు హాజరవుతారని తెలిపారు. ఆటోమొబైల్ విడిభాగాలు,ఆహార & పానీయాలు,ఎలక్ట్రానిక్స్,శానిటరీవేర్, వ్యవసాయ యంత్రాలు, ఐటీ సేవలు, ఔషధాలు, వైద్య పరికరాలు, వస్త్ర పరిశ్రమ వంటి అనేక రంగాల వ్యాపార అవకాశాలను ఈ సందర్భంగా పరిశీలించనున్నట్లు చెప్పారు.
వివరాలు
ఎంఎస్‌ఎంఈలకు విలువైన అవకాశం
సదస్సులో కొనుగోలుదారుల సమావేశాలు, బి2బి చర్చలు, నెట్‌వర్కింగ్ కార్యకలాపాలు నిర్వహించబడతాయని, ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ఎంఎస్‌ఎంఈలు రూపొందించే ఉత్పత్తులను విదేశీ ప్రతినిధులకు పరిచయం చేసి, ఎగుమతుల విస్తరణకు అందుబాటులో ఉన్న అవకాశాలను చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఉన్న ఎంఎస్‌ఎంఈలు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని, అందుకు https://indiasmeforum.org/itd/rbsm-vizag-2025 వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. గ్లోబల్ సప్లై చైన్‌లో భాగస్వామ్యం అవ్వడానికి ఇది రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలకు విలువైన అవకాశం అవుతుందని, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన విధానాలు, డిజిటల్ పాలన వల్ల చిన్న వ్యాపారాలు అంతర్జాతీయ స్థాయిలో ముందుకు సాగుతున్నాయని శివశంకరరావు అన్నారు.