Loading...
AP Government: ఏపీలో చిన్న పరిశ్రమలకు భారీ ప్రోత్సాహం.. రెండేళ్లలో 2,876 ఎంఎస్ఎంఈలకు భూములు
ఏపీలో చిన్న పరిశ్రమలకు భారీ ప్రోత్సాహం.. రెండేళ్లలో 2,876ఎంఎస్ఎంఈలకు భూములు

AP Government: ఏపీలో చిన్న పరిశ్రమలకు భారీ ప్రోత్సాహం.. రెండేళ్లలో 2,876 ఎంఎస్ఎంఈలకు భూములు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 24, 2026
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్'లో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈలు) ప్రోత్సహించడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు అందిన వెంటనే సాధ్యమైనంత వేగంగా భూములు కేటాయించే విధానాన్ని అమలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2024 జూన్‌ నుంచి ఇప్పటివరకు 2,876 ఎంఎస్ఎంఈలకు భూములు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.

వివరాలు 

ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త

'ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త' లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 175 ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తోంది.

చిన్న పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడం ద్వారా బలమైన పారిశ్రామిక ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

ఈ రంగం ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని భావిస్తున్న ప్రభుత్వం, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు ఉన్న అన్ని అవకాశాలపై దృష్టి సారిస్తోంది.

వివరాలు 

భూముల కేటాయింపులో రికార్డు

గత వైకాపా ప్రభుత్వం 2019-24 మధ్య ఐదేళ్లలో ఎంఎస్ఎంఈలకు మొత్తం 3,573 ఎకరాల భూమిని కేటాయించింది.

అంటే ఏడాదికి సగటున 714.6 ఎకరాల చొప్పున కేటాయించినట్లు లెక్క. దీనితో పోలిస్తే కూటమి ప్రభుత్వం 2024 జూన్‌ నుంచి ఇప్పటివరకు రెండేళ్లలో ఏడాదికి సగటున 963.5 ఎకరాల చొప్పున భూములు కేటాయించింది.

గత ప్రభుత్వంతో పోలిస్తే వార్షిక సగటు కేటాయింపు గణనీయంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

రూ.50 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం

చిన్న పరిశ్రమల ద్వారా ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించాలన్నది ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం. అదే సమయంలో కనీసం 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని భావిస్తోంది.

ఇప్పటివరకు రాష్ట్రంలో ఏర్పాటైన 2,876 ఎంఎస్ఎంఈల ద్వారా రూ.8,060 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ పరిశ్రమల ద్వారా 1.03 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఆయా సంస్థలు తమ ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

పెట్టుబడుల్లోనూ వేగం

వైకాపా ప్రభుత్వ హయాంలో ఎంఎస్ఎంఈ రంగంలోకి ఏడాదికి సగటున రూ.2,021.60 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏడాదికి సగటున రూ.4,030 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే వార్షిక సగటు పెట్టుబడుల ప్రవాహం దాదాపు రెట్టింపైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఎకోసిస్టమ్‌ కోసం 175 పార్కులు

చిన్న పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోంది.

ప్రతి నియోజకవర్గంలో ఒక పార్కు చొప్పున అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూమిని బట్టి ఒక్కో పార్కుకు 10 నుంచి 50 ఎకరాల వరకు కేటాయించాలని ప్రతిపాదించింది.

వివరాలు 

ప్లగ్‌ అండ్‌ ప్లే సదుపాయాలు

ఈ పార్కుల ద్వారా మొత్తం సుమారు 3,500 ఎకరాల భూమి చిన్న పరిశ్రమలకు అందుబాటులోకి రానుంది.

ఎంఎస్ఎంఈ పార్కుల్లో పరిశ్రమలు వేగంగా కార్యకలాపాలు ప్రారంభించేలా అవసరమైన మౌలిక వసతులను ఏపీఐఐసీ సమకూర్చనుంది.

ఇందులో లేఅవుట్, ప్లగ్‌ అండ్‌ ప్లే సదుపాయాలు, అంతర్గత రహదారులు, నీటి సరఫరా నెట్‌వర్క్, వీధి దీపాలు, రెడీ టు ఫ్యాక్టరీ షెడ్లు, విద్యుత్‌ పంపిణీ నెట్‌వర్క్, టెలికమ్యూనికేషన్‌ సదుపాయాలు, పరిపాలనా భవనాలు ఉంటాయి.

దీంతో పారిశ్రామికవేత్తలు మౌలిక వసతుల కోసం ఎక్కువ సమయం, పెట్టుబడి వెచ్చించాల్సిన అవసరం లేకుండా పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది.

వివరాలు 

సాంకేతికత, నైపుణ్య శిక్షణ

రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్‌టీఐహెచ్‌) ద్వారా ఎంఎస్ఎంఈలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్య శిక్షణ అందించే చర్యలు చేపట్టింది.

అమరావతిలో ఆర్‌టీఐహెచ్‌ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, అనంతపురంలో స్పోక్‌ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

చిన్న పరిశ్రమలకు సాంకేతిక సహకారం, నైపుణ్యాభివృద్ధి అందించడం ద్వారా వాటి సామర్థ్యాన్ని మరింత పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ADVERTISEMENT