పోలీసులకు ఏపీ సర్కారు షాక్.. వివిధ విభాగాలకు అలవెన్సుల కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు విభాగాల పోలీస్ సిబ్బంది అలవెన్సుల్లో కోతలు విధించింది. ఈ నేపథ్యంలోనే జీఓ నెం 79ని జారీ చేసింది. దిశ పోలీస్ సిబ్బందికి గతంలో కేటాయించిన 30 శాతం అలవెన్సులను కూడా తీసేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేసే యాంటీ నక్సలిజం స్క్వాడ్ (ANTI NAXALISM SQUAD) సిబ్బందికి ప్రస్తుతం ఇస్తున్న 15 శాతం స్పెషల్ అలవెన్సులనూ తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు డిప్యూటేషన్ పై ఏసీబీ (ANTI CORRUPTION BUREAU)లో పని చేస్తున్న వారికీ ప్రత్యేక భత్యాలను దాదాపు 30 నుంచి 25 శాతానికి తగ్గించింది.
పోలీసులకు భత్యాల కోతపై టిడిపి మండిపాటు
ACBలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయిన వారి భత్యాలను 10 నుంచి 8 శాతానికి కుదిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. గత నెల జులై 12న పలు రకాల ప్రత్యేక భత్యాల్లో కోతలు విధిస్తూ జీఓ నెంబర్ 79ని విడుదల చేసింది. సదరు జీఓకు తాము సానుకూలంగానే ఉన్నామని DGP ఆఫీస్ ప్రభుత్వానికి వెల్లడించడం గమనార్హం. ఈ మేరకు పోలీస్ స్పెషల్ అలవెన్సుల్లో కోతలు విధిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు భత్యాల్లో కోతలు విధించడంపై టీడీపీ మండిపడింది. పోలీసులను సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు వాడుకుని వదిలేశారని పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీస్ సంఘాలు స్పందించాలని డిమాండ్ చేశారు.