కడప: చంద్రబాబు రోడ్‌షోలో అగ్నిప్రమాదం
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో అగ్నిప్రమాదం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా ఆయన జమ్మలమడుగులో పర్యటిస్తున్నారు. ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చేపట్టిన యాత్రలో భాగంగానే బుధవారం ఉదయం జమ్మలమడుగులో నిర్వహించిన రోడ్‌షోలో అగ్నిప్రమాదం సంభవించింది. చంద్రబాబుకు సమీపంలోనే ఓ టిఫిన్ బండికి అగ్గి అంటుకుంది. ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదు. దీంతో అందరూ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం నంద్యాల జిల్లాలో పర్యటించిన చంద్రబాబు అదే రోజు రాత్రి కడప జిల్లాలోకి ప్రవేశించారు. ఈ మేరకు జమ్మలమడుగు చేరుకున్నారు. నేటి ఉదయం నుంచి రోడ్ షో కొనసాగిస్తున్నారు.
పులివెందుల పూలంగళ్లు సెంటర్‌లో చంద్రబాబు బహిరంగ సభ
కడప జిల్లాలోని జమ్మలమడుగు కేంద్రం నుంచి సీబీఆర్ 2 పరిశీలనకు చంద్రబాబు బయలుదేరారు. ఈ మేరకు ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ కోండాపురం మీదుగా CBR 2కు చేరుకోనున్నారు. ముందుగా ప్రాజెక్టును పరిశీలించనున్నారు. అక్కడ పవర్ ప్రజెంటేషన్ అనంతరం పాత్రికేయ సమావేశంలో పాల్గొననున్నారు. దూరదృష్టితోనే తెలుగుదేశం ప్రభుత్వం హంద్రినీవా సహా అనేక ప్రాజెక్టులను నిర్మించిదని చంద్రబాబు వెల్లడించారు. రాయలసీమ కోసం జగన్ ఎప్పుడైనా పనిచేశారా అని ప్రశ్నించారు. అనంతరం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ఆయన సందర్శించారు. ఇవాళ తొలుత గండికోట ప్రాజెక్టును పరిశీలించనున్న ప్రతిపక్ష నేత, అనంతరం పులివెందులలో రోడ్ షో చేపట్టనున్నారు. ఈ మేరకు పూలంగళ్లు సెంటర్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో సాగునీటి రంగంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని నిలదీయనున్నారు.