Page Loader
సీఎం జగన్ రాష్ట్రాన్ని రివర్స్‌ గేర్‌లో  నడిపిస్తున్నారు: టీడీపీ అధినేత చంద్రబాబు
రివర్స్‌ గేర్‌లో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారంటూ ధ్వజం

సీఎం జగన్ రాష్ట్రాన్ని రివర్స్‌ గేర్‌లో  నడిపిస్తున్నారు: టీడీపీ అధినేత చంద్రబాబు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 25, 2023
03:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికార వ్యామోహం రాష్ట్రానికి శాపంగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను నాశనం చేసి రివర్స్‌ గేర్‌లో పాలన నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఏపీని పరిపాలించే అర్హత జగన్‌కు ఎక్కడిదని అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు టమాటా వేయలేకపోయారని, ఇప్పుడు ధరలు పెరగడానికి జగనే కారణమన్నారు. జగన్‌ పాలనలో గంజాయి ఒక్కటే అద్భుతంగా సాగవుతుందని ఎద్దేవా చేశారు. కొవిడ్ కాలంలో రైతు ఒక్కరే దేశానికి అన్నం పెట్టారని,ఈ మేరకు 93 శాతం అన్నదాతలు అప్పులపాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. సగటున ఒక్కో రైతుపై రూ.2.45 లక్షలపైనే అప్పు ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

DETAILS

అమరావతి రైతులపై జగన్‌కు కక్ష ఎందుకంటూ నిలదీత

ఓ వైపు రైతులపై అప్పుల భారం మోపుతూ మరోవైపు జగన్‌ మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రాయలసీమలో హార్టికల్చర్‌, కోస్తాలో ఆక్వాకల్చర్‌కు ప్రాధాన్యమిచ్చామని చంద్రబాబు అన్నారు. అమరావతిలో రైతుల భూమి దానం చేసిన జగన్‌ దానకర్ణుడైతే తన భూమే ఇవ్వొచ్చన్నారు. మరోవైపు నీటి సెస్సును వెయ్యి లీటర్లకు రూ.12 నుంచి రూ.120 పెంచేశారన్నారు. కృష్ణా గోదావరి నదులున్న ఏపీలో నీటిపై భారీ సెస్సులు విధించడంపై చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. ఆర్‌-5 జోన్‌లో గృహ నిర్మాణాలకు కోర్టు అనుమతులు వచ్చాయా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అమరావతి రైతులపై జగన్‌కు కక్ష ఎందుకని నిలదీశారు.