ఏపీ, బాంబే హైకోర్టులకు కొత్త సీజేలు.. కొలిజీయం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం
బాంబే,ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు నూతనంగా ప్రధాన న్యాయమూర్తులు నియామకమయ్యారు.ఈ మేరకు జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్, జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ లకు పదోన్నతి లభించింది. అలహాబాద్ హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ బాంబే హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు. బాంబే హైకోర్టులో విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ ఏపీ సీజేగా ప్రమోషన్ పొందారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘావాల్ తెలిపారు. ఈ నెల 5న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు.అనంతరం ఇందుకు సంబంధించి కేంద్రం ఉత్తర్వులను జారీ చేసింది. ఏపీ సీజేగా నియామకమైన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 25, 1964న జమ్మూకశ్మీర్ లో జన్మించారు.
మణిపూర్ హైకోర్టు సీజేగా ఠాకూర్ ఫైల్ పెండింగ్ పెట్టిన కేంద్రం
ఠాకుర్ 1989 అక్టోబర్ 18న తొలుత దిల్లీ, తర్వాత జమ్మూకశ్మీర్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా రిజిస్టర్ అయ్యారు. 2013 మార్చి 8న జమ్మూకశ్మీర్ హైకోర్టు జడ్జిగా నియామకమయ్యారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రకు సుప్రీం న్యాయమూర్తిగా పదోన్నతి దక్కింది. హైకోర్టు సీజేగా ధీరజ్ నియామకంతో జమ్మూకశ్మీర్, లద్ధాఖ్ ప్రాంతానికి ప్రాతినిధ్యం లభిస్తుందని కొలీజియం అభిప్రాయపడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఠాకూర్ ను మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. అయితే ఆ ఫైల్ కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. దీంతో ఈ నెల 5న ధీరజ్ సింగ్ ను ఏపీ హైకోర్టు సీజేగా నియమించాలని సుప్రీం నిర్ణయించింది.