ఏపీలో హాట్ పాలిటిక్స్.. గన్నవరం బరిలోనే నిలబడతా : యార్లగడ్డ వెంకట్రావు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ గన్నవరం నుంచే బరిలోకి దిగుతానని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు తేల్చి చెప్పారు.
ఓ కేసు విషయమై కోర్టు వాయిదాకు వెళ్తూ నగరంలోని హనుమాన్ జంక్షన్‌లో పార్టీ శ్రేణులతో యార్లగడ్డ సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ మరో సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుతో యార్లగడ్డ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన యార్లగడ్డ, తాను టీడీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని కార్యకర్తలకు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి పోటీ చేయనున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యాక దీనిపై తుది నిర్ణయం వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు.
DETAILS
గన్నవరం రాజకీయాల్లోనే కొనసాగుతానంటున్న యార్లగడ్డ వెంకట్రావ్
అయితే ఒక వేళ తనకు టిక్కెట్ రాకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసే విషయంపైనా సందిగ్ధంలో ఉన్నట్లు యార్లగడ్డ అన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణాలతోనే 2019 ఎన్నికల తర్వాత గన్నవరం నియోజకవర్గ కార్యకర్తలకు దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
గత ఎన్నికలు ముగిశాక తాను అమెరికాకు మూడు దఫాలు వెళ్లి వచ్చానన్నారు.అమెరికాలో తనకు వ్యాపారాలున్నా గన్నవరం రాజకీయాల్లోనే కొనసాగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గన్నవరం బరిలో దిగనున్నట్లు కార్యకర్తలతో వెంకట్రావు మనసులో మాటను పంచుకున్నారు.
గతంలో కేడీసీసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ గా యార్లగడ్డ వెంకట్రావు పనిచేశారు.ఇప్పటికే గన్నవరం టిక్కెట్ రేసులో వైసీపీ నుంచి వల్లభనేని వంశీ ఉన్నారు. యార్లగడ్డ ప్రకటన అధికార పార్టీలో సంచలనంగా మారింది.