LOADING...
US-Israeli war: విశాఖ పోర్టు చరిత్రలో రికార్డు.. 10,000 కంటైనర్లు నడి సముద్రం నుంచి వెనక్కి!
విశాఖ పోర్టు చరిత్రలో రికార్డు.. 10,000 కంటైనర్లు నడి సముద్రం నుంచి వెనక్కి!

US-Israeli war: విశాఖ పోర్టు చరిత్రలో రికార్డు.. 10,000 కంటైనర్లు నడి సముద్రం నుంచి వెనక్కి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 08, 2026
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో యుద్ధ ఉత్కంఠలు అంతర్జాతీయ సముద్ర వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. హర్మూస్ జలసంధిలో నెలకొన్న అనిశ్చితి కారణంగా విశాఖ పోర్టు నుండి ఎగుమతి అయిన వేలాది కంటైనర్లు తమ గమ్యస్థానాలకు చేరలేక మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణం ప్రమాదకరమని భావించిన అధికారులు, నౌకలను తిరిగి వెనక్కి రప్పిస్తున్నారు. విశాఖ పోర్టు చరిత్రలో ఇలా ఎగుమతి సరుకు తిరిగి రాబడడం ఇదే మొదటి సారి. ప్రారంభ అంచనాల ప్రకారం, సుమారు 10,000 కంటైనర్లు తిరిగి విశాఖ తీరానికి చేరుకోనున్నారు. ప్రధానంగా సీఫుడ్ (రొయ్యలు, చేపలు), ఫార్మా ఉత్పత్తులు, జీడిపప్పు వంటి విలువైన సరుకులు ఎగుమతి అవుతాయి. ఈ సరుకులను పాడకుండా ఉంచడానికి రెఫ్రిజరేటెడ్ కంటైనర్స్‌లో నిల్వ చేయాలి.

Details

రోజుకు సుమారు రూ.5వేలు విద్యుత్ బిల్లు 

అయితే వీటిని యార్డుల్లో భద్రపరచడం ఖర్చుతో కూడుకున్నది. ఒక్కో కంటైనర్‌కు రోజుకు సుమారు రూ.5,000 వరకు విద్యుత్ బిల్లు రావచ్చు. దీంతో వచ్చే లాభం కంటే నిర్వహణ ఖర్చు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. వేల సంఖ్యలో కంటైనర్లు తిరిగి రావడంతో పోర్టులో స్థల కొరత ఏర్పడింది. ఈ కంటైనర్ల నిల్వకు కనీసం 16,000 చదరపు మీటర్ల స్థలం అవసరమని టెర్మినల్ అధికారులు పోర్ట్ ట్రస్ట్‌కు లేఖ రాశారు. ఈ అసాధారణ పరిస్థితిని ఎదుర్కోవడానికి కస్టమ్స్ చీఫ్ కమిషనర్ ఎగుమతిదారులు, టెర్మినల్ నిర్వాహకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సాధారణంగా ఎగుమతి అయిన సరుకు మీద ఉండే నిబంధనలు తిరిగి వచ్చే సరుకుపై వర్తించవు, అందువల్ల కస్టమ్స్ విభాగం కొత్త గైడ్‌లైన్స్ రూపొందిస్తున్నది.

Details

నిల్వ చేయడం కష్టమే

ఎగుమతిదారుల ప్రధాన ఆందోళన సరుకు నాణ్యతపై ఉంది. ముఖ్యంగా సముద్ర ఉత్పత్తులను 3-5 రోజులు మించి నిల్వ చేయడం కష్టం. నౌక ప్రయాణంలో ఉండే అత్యాధునిక ప్రిజర్వేషన్ సౌకర్యాలు, పోర్టులోని యార్డుల్లో ఉండకపోవచ్చు. దీని వల్ల వేల కోట్ల రూపాయల విలువైన ఆహార ఉత్పత్తులు చెడిపోవచ్చని ప్రమాదం ఉంది. యుద్ధం కారణంగా అరేబియా సముద్రం మరియు గల్ఫ్ దేశాల వైపు వెళ్లే మార్గాల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉన్నంతకాలం, ఎగుమతులు తమ గమ్యానికి సురక్షితంగా చేరే అవకాశం తక్కువగా ఉంది.

Advertisement