US-Iran: అమెరికాకు భారీ ఎదురుదెబ్బ.. ఒకే రోజులో రెండు యుద్ధవిమానాలు కూల్చిన ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల్లో అమెరికా అనేక షాక్‌లను ఎదుర్కొంటోంది. ఒకే రోజులో రెండు అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ చేత కూల్చివేయబడ్డాయి. అదేవిధంగా రెండు హెలికాప్టర్లపై కూడా దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని, మరొక పైలట్ ఇంకా గల్లంతైనట్లు సమాచారం. శుక్రవారం అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసింది. ఈ విమానంలో ఒక పైలట్, వెపన్ సిస్టమ్ అధికారి ఉన్నారు. అధికారులు ఒకరిని రక్షించామని, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోందని అమెరికా, ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఘటనల గంటల్లోనే హర్మూజ్ సమీపంలో ఏ-10 వార్‌థగ్ ఫైటర్ జెట్‌ను కూడా ఇరాన్ కూల్చేసింది.
వివరాలు
సురక్షితంగా బయటపడ్డ పైలట్
ఈ విమాన శకలాలు కువైట్‌లో పడినప్పటికీ, ఆ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. మొదటి యుద్ధ విమానంలో గల్లంతైన పైలట్‌ను రక్షించడానికి రెండు బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు గాలింపు చేపట్టాయి. వీటిపైనా ఇరాన్ దాడి చేసింది, అయితే వీటిని తప్పించుకుని సురక్షితంగా గగనతలం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ పరిణామాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సమాచారం అందించారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ పేర్కొన్నారు. ఏ-10 యుద్ధ విమానం కూలిన దృశ్యాలను ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
వివరాలు
మేం యుద్ధంలోనే ఉన్నాం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఘటనలపై స్పందిస్తూ ఇలాంటి సంఘటనలు దౌత్య చర్చలపై ప్రభావం చూపవు. ఇది యుద్ధం, మేం యుద్ధంలోనే ఉన్నామన్నారు. ఇలా, ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణల్లో అమెరికా గణనీయంగా షాక్‌లను ఎదుర్కొంటున్నప్పటికీ, అధికారికంగా దౌత్య చర్చలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం అయ్యింది