Forex reserves: షాకింగ్..విదేశీ మారక నిల్వల తగ్గుదల
ఈ వార్తాకథనం ఏంటి
దేశ ఆర్థిక స్థిరత్వాన్ని సూచించే ముఖ్యమైన ప్రమాణాల్లో ఒకటైన విదేశీ మారక నిల్వలు ఇటీవల వేగంగా క్షీణిస్తున్నాయి. మార్చి 27తో ముగిసిన వారంలో మాత్రమే భారత విదేశీ మారక నిల్వలు 10.29 బిలియన్ డాలర్లు (సుమారు రూ.95 వేల కోట్లు) తగ్గి 688.06 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని భారత రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. అంతకుముందు వారంలో కూడా 11.41 బిలియన్ డాలర్ల మేర తగ్గుదల నమోదవడం ఆందోళన కలిగించే విషయం.
వివరాలు
యుద్ధం వల్ల రూపాయి పతనం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారత రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27న గరిష్ట స్థాయిగా నమోదైన 728.49 బిలియన్ డాలర్ల నిల్వలు, యుద్ధ వాతావరణం ఏర్పడిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. రూపాయి విలువ పతనాన్ని నియంత్రించేందుకు రిజర్వు బ్యాంక్ మార్కెట్లో డాలర్లను విక్రయించడం, ఊహాగానాలపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి చర్యలు ఈ నిల్వల తగ్గుదలకు దారితీశాయి. మారక నిల్వలలో ముఖ్య భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 6.62 బిలియన్ డాలర్లు తగ్గి 551.07 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారం నిల్వల విలువ కూడా 3.66 బిలియన్ డాలర్ల మేర తగ్గి 113.52 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.
వివరాలు
ఆ ప్రమాదం తప్పదా?
అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ మాత్రం 17 మిలియన్ డాలర్ల మేర పెరిగి 18.65 బిలియన్ డాలర్లకు చేరాయి. విదేశీ మారక నిల్వలు ఇలా తగ్గిపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ వేగంగా పడిపోతుంది. దీని ఫలితంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా ముడి చమురు దిగుమతి ఖరీదు పెరగడం వల్ల రవాణా వ్యయాలు అధికమై, దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా యంత్రాల దిగుమతికి అవసరమైన విదేశీ మారకం లభించకపోవడం వల్ల పరిశ్రమల అభివృద్ధి మందగిస్తుంది. చివరికి దేశ రుణ చెల్లింపు సామర్థ్యం దెబ్బతిని, ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఏర్పడుతుంది.