Loading...
Andhra Pradesh: ఏపీ ఖజానాకు నాలుగు నెలల్లో రూ.54,059 కోట్ల ఆదాయం.. అప్పులు రూ.49 వేల కోట్లు..కాగ్‌ గణాంకాల విడుదల
అప్పులు రూ.49 వేల కోట్లు..కాగ్‌ గణాంకాల విడుదల

Andhra Pradesh: ఏపీ ఖజానాకు నాలుగు నెలల్లో రూ.54,059 కోట్ల ఆదాయం.. అప్పులు రూ.49 వేల కోట్లు..కాగ్‌ గణాంకాల విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2026
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.54,059.20 కోట్ల రెవెన్యూ ఆదాయం సమకూరింది. ఏడాది మొత్తానికి ప్రభుత్వం అంచనా వేసిన రెవెన్యూ రాబడిలో ఇప్పటికే 23.09 శాతం అందినట్లు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వెల్లడించింది. సోమవారం విడుదల చేసిన నాలుగు నెలల ఆర్థిక గణాంకాల్లో ఈ వివరాలను పేర్కొంది. రాష్ట్ర సొంత పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం కూడా గణనీయంగా ఉంది. తొలి నాలుగు నెలల్లో ఏపీ ప్రభుత్వం సొంత పన్నుల రూపంలో రూ.48,764.45 కోట్లను సమీకరించింది. ఏడాది మొత్తం సొంత పన్నుల ద్వారా వస్తుందని అంచనా వేసిన ఆదాయంలో ఇది 25.64 శాతానికి సమానం.

వివరాలు 

నాలుగు నెలల్లోనే పావు వంతుకు పైగా సొంత పన్నుల ఆదాయం

అంటే.. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నాలుగు నెలల్లోనే పావు వంతుకు పైగా సొంత పన్నుల ఆదాయం వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి.

మరోవైపు.. ప్రభుత్వం తీసుకున్న అప్పులను కూడా కలిపితే తొలి నాలుగు నెలల్లో రాష్ట్రానికి మొత్తం రూ.1,03,230 కోట్ల నిధులు సమకూరాయి.

ఇందులో అధిక భాగం రెవెన్యూ అవసరాలకే వినియోగించినట్లు కాగ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యవధిలో రూ.91,001.56 కోట్లను రెవెన్యూ వ్యయంగా ప్రభుత్వం ఖర్చు చేసింది.

వివరాలు 

అప్పులు రూ.49,134.14 కోట్లు

తొలి నాలుగు నెలల్లో ఏపీ ప్రభుత్వం రూ.49,134.14 కోట్ల రుణాన్ని సమీకరించింది.

దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో అప్పుల వాటా గణనీయంగా ఉన్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదే సమయంలో తొలి నాలుగు నెలల కాలానికి రాష్ట్ర రెవెన్యూ లోటు 167.90 శాతంగా నమోదైంది.

ఆస్తుల కల్పనకు, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మూలధన వ్యయం మాత్రం రూ.9,689.36 కోట్లుగా ఉంది.

అంటే ప్రభుత్వం చేసిన మొత్తం వ్యయంలో రెవెన్యూ అవసరాల కోసం చేసిన ఖర్చుతో పోలిస్తే మూలధన వ్యయం తక్కువగా ఉన్నట్లు కాగ్‌ విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తోంది.

ADVERTISEMENT