
Maternity Leave: మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. మెటర్నిటీ లీవ్స్ పెంచుతూ నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగుల కోసం శుభవార్తను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.
ఇప్పటివరకు అందుతున్న 120 రోజుల మాతృత్వ సెలవులను 180 రోజులుగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ సంబంధిత ఉత్తర్వులను ప్రభుత్వం సోమవారం నాడు విడుదల చేసింది.
ఇంతకుముందు వరకు ఈ ప్రసూతి సెలవులు కేవలం ఇద్దరు పిల్లలకే పరిమితంగా వర్తించేవి.
అయితే తాజా ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఈ నిబంధనను తొలగించారు.
ఇకపై ఎంతమంది పిల్లలు ఉన్నా, ప్రతి సారి ప్రసూతి తర్వాత మహిళా ఉద్యోగులు మాతృత్వ సెలవులు పొందవచ్చు. కొత్త జీవో ప్రకారం ఈ మార్పులు తక్షణమే అమలులోకి రానున్నాయి.
వివరాలు
రాష్ట్రంలో జనన రేటును 1.5 శాతం నుంచి 2.1 శాతానికి పెంచే లక్ష్యం
ఇక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం ప్రకారం,కొత్తగా ఉద్యోగంలో చేరిన మహిళా ప్రభుత్వ ఉద్యోగినులకు కూడా ప్రసూతి సెలవులు మంజూరవుతాయి.
ప్రోబేషన్ లో ఉన్న ఉద్యోగినులు కూడా మాతృత్వ సెలవులను తీసుకునే హక్కు కలిగి ఉంటారని అప్పట్లో విడుదల చేసిన గెజెట్ స్పష్టం చేసింది.
ఇప్పుడు ఆ శ్రేణిలోనే 'ఇద్దరు పిల్లలకు మాత్రమే సెలవులు' అన్న నిబంధనను కూడా పూర్తిగా తొలగించడం గమనార్హం.
ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జనన రేటును పెంచే దిశగా పలు సూచనలు చేస్తూ వస్తున్నారు.
ఆయన తాజా ప్రకటనల ప్రకారం, రాష్ట్రంలో జనన రేటును 1.5 శాతం నుంచి 2.1 శాతానికి పెంచే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
వివరాలు
ఇద్దరికి మించి పిల్లలకి 'తల్లికి వందనం'
ఈ దిశగా సంతానోత్పత్తిని ప్రోత్సహించే పథకాలను అమలు చేయనున్నట్టు వెల్లడించారు.
అందులో భాగంగానే, ఎంతమంది పిల్లలు ఉన్నా మహిళా ఉద్యోగులకు మాతృత్వ సెలవులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాకుండా, ఒకే కుటుంబంలో ఇద్దరికి మించి పిల్లలు చదువుకుంటున్నా, అందరికీ 'తల్లికి వందనం' పథకం వర్తిస్తుందని సీఎం పేర్కొన్నారు.