
AP : రహస్య జీవోలను బయటపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అందులో వైసీపీ ప్రభుత్వంలో రహస్యంగా ఉంచిన జీవోలను బహిర్గతం చేయాలని పేర్కొంది.
2021 ఆగస్టు 15 నుండి 2024 ఆగస్టు 28 వరకు జారీ చేసిన రహస్య జీవోలను అధికారికంగా జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సంబంధిత అధికారులకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఆదేశాలను జారీ చేసింది.
జీవోఐఆర్ వెబ్‌సైట్ 2008లో ప్రారంభమై, అప్పటి నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు, జీవో కాపీలను అందులో అప్‌లోడ్ చేస్తోంది.
అయితే, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ వ్యవధిలో జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పటివరకు అప్‌లోడ్ చేయకపోవడం గమనార్హం.
Details
రహస్య జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి
టీడీపీ, జనసేన వంటి ప్రతిపక్షాలు, ఈ జీవోలను ఉద్దేశపూర్వకంగా రహస్యంగా ఉంచుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ రహస్య జీవోలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు పారదర్శకతతో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని జీఏడీ కార్యదర్శి సురేశ్ కుమార్ స్పష్టం చేశారు.
జీవోలు ప్రజలకు స్పష్టత ఇస్తాయి, కానీ మూడేళ్ల కాలానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు అందుబాటులో లేకపోతే సమాచార లోపం ఏర్పడవచ్చని ఆయన వెల్లడించారు.
అందుకే, ఈ మూడు సంవత్సరాలకు సంబంధించిన జీవోలు, ప్రభుత్వ ఉత్తర్వులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.