Special Task Force: జెట్ స్పీడ్‌తో నేషనల్ హైవే ప్రాజెక్టు పనులు.. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జెట్ స్పీడ్‌తో నేషనల్ హైవే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం, నేషనల్ హైవే ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
12 మంది సభ్యులతో టాస్క్ ఫోర్స్
NHAI, MoRTH (మంత్రిత్వ శాఖ) ఆధ్వర్యంలోని ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టాస్క్ ఫోర్స్‌ను రోడ్లు భవనాల శాఖ మంత్రి నేతృత్వం వహించనున్నారు. 12 మంది సభ్యులతో ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. ఇందులో జలవనరుల శాఖ, ఇంధన శాఖల స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీలు, CCLA, పంచాయితీరాజ్, గనులు, రోడ్లు భవనాల శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు వంటి 11 మంది అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈ టాస్క్ ఫోర్స్, ప్రతి నెలలో ఒకసారి సమావేశమై, రోడ్ల నిర్మాణంలో ఎదురవుతున్న అడ్డంకులను, ముఖ్య సమస్యలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకుంటుంది.