Andhra Pradesh: ఏపీలో రూ.9,773 కోట్లతో 'వీబీ జీ రామ్ జీ' కార్యక్రమం.. గ్రామాభివృద్ధికి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి రూ.9,773 కోట్ల వ్యయంతో 'వీబీ జీ రామ్ జీ' కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కలెక్టర్ల సదస్సులో పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖల పనితీరును సమీక్షించిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాదించిన మొత్తం 12రకాల పనులను గ్రామాల్లో అమలు చేయాలని సీఎం సూచించారు. ఇందులో 8 పనులు వ్యక్తిగత ప్రయోజనాలకు,4 పనులు సామాజిక ప్రయోజనాలకు సంబంధించినవిగా ఉంటాయని చెప్పారు. ఈ పనులు సమర్థంగా అమలైతే గ్రామాలు పరిశుభ్రంగా మారడంతో పాటు గ్రామీణ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజల ఆర్థికాభివృద్ధిని పెంపొందించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్లు ప్రత్యేకంగా కసరత్తు చేయాలని సీఎం సూచించారు.
వివరాలు
'మెటీరియల్' నిధుల వినియోగంలో ఏపీకి దేశంలో మొదటి స్థానం
ఈ కార్యక్రమాల అమలులో డ్వాక్రా సంఘాలను కూడా భాగస్వాములుగా చేయాలని ఆయన ఆదేశించారు. ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మెటీరియల్ కాంపోనెంట్ నిధుల కింద రూ.3,185 కోట్లు ఖర్చు చేసి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని వెల్లడించగానే సమావేశంలో ఉన్న మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు చప్పట్లతో ముఖ్యమంత్రిని అభినందించారు. దేశవ్యాప్తంగా మొత్తం రూ.17 వేల కోట్లకు పైగా మెటీరియల్ నిధులు ఖర్చు చేసినట్లు శశిభూషణ్‌కుమార్ వివరించారు.
వివరాలు
శ్రామికులకు 'గ్రామీణ్ రోజ్‌గార్' కార్డులు
'వీబీ జీ రామ్ జీ' కార్యక్రమంలో భాగంగా శ్రామికులకు 'గ్రామీణ్ రోజ్‌గార్ గ్యారంటీ' కార్డులు జారీ చేయనున్నట్లు శశిభూషణ్‌కుమార్ ముఖ్యమంత్రికి తెలిపారు. కార్మికుల హాజరు నమోదులో పారదర్శకత కోసం ముఖ ఆధారిత గుర్తింపు విధానం మరియు ఇ-కేవైసీ తప్పనిసరిగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం కింద గ్రామాల్లో సౌర దీపాల ఏర్పాటు, జలజీవన్ మిషన్ పనులు, గ్రామ గ్రంథాలయాల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ సౌకర్యాల కల్పన వంటి అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.