
Nara Lokesh: జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేశ్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ సంవత్సరం నవంబరు చివరి వారంలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహణకు, 2026 జనవరిలో డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. మార్చిలో డీఎస్సీ,స్పెషల్ డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రత్యేక డీఎస్సీలో 2,260 పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే ఆమోదం లభించిందని తెలిపారు. గురువారం ఉండవల్లి నివాసంలో పాఠశాల,ఇంటర్మీడియట్, కళాశాల విద్యపై జరిగిన సమీక్షలో మంత్రి లోకేశ్ అభ్యర్థులకు పూర్తి సన్నద్ధత అవసరమని, వచ్చే విద్యా సంవత్సర ప్రారంభానికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా అధికారులు ప్రణాళికలను అమలు చేయాలని ఆదేశించారు.
వివరాలు
సిలబస్ పూర్తి, అభ్యాస ప్రణాళికల అమలు
అలాగే, విద్యార్థుల కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి భవిష్యత్తులో లక్ష్య ప్రణాళికలు రూపొందించాల్సిందని,బేస్‌లైన్ పరీక్ష నిర్వహణకు విధివిధానాలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. పదో తరగతి విద్యార్థుల కోసం డిసెంబర్ ముగింపు వరకు సిలబస్ పూర్తి చేయడం ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. వంద రోజుల ప్రణాళిక ద్వారా విద్యార్థుల ఫలితాలను మెరుగుపరచడానికి కృషి చేయాలని ఆదేశించారు. 1వ నుండి 5వ తరగతుల వరకు పాఠ్య ప్రణాళిక సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయడం అవసరమని సూచించారు. అలాగే, నవంబరు 26న ఘనంగా రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాల్సిందిగా పేర్కొన్నారు. ఆ రోజున నిర్వహించనున్న స్టూడెంట్ అసెంబ్లీకి సీఎం, డిప్యూటీ సీఎం, సభాపతి తో పాటు ఆయన కూడా హాజరవుతారని ప్రకటించారు.
వివరాలు
ఉత్తమ ఉపాధ్యాయులు, ప్రత్యేక పథకాలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 78 ఉత్తమ ఉపాధ్యాయులందరికీ మెరుగైన విద్యా ప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్ పర్యటనకు పంపాలని మంత్రి ఆదేశించారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. అలాగే, కడప స్మార్ట్ కిచెన్ మోడల్ ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అమరావతిలో రూ. 100 కోట్లతో నిర్మించనున్న కేంద్రీయ గ్రంథాలయం కోసం డిజైన్ సిద్ధం చేసేందుకు హ్యాకథాన్ నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల నుండి గ్రంథాలయ పన్ను సేకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇంటర్మీడియట్ విద్యలో మెరుగైన ఫలితాల సాధన కోసం వంద రోజుల ప్రణాళికను అమలు చేయడం అత్యవసరమని ఆయన తెలిపారు.