
Andhra News: ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ పాలసీ 2024-29 విడుదల: లక్ష్యంగా 20,000 కొత్త స్టార్టప్‌లు,లక్ష మందికి ఉపాధి
ఈ వార్తాకథనం ఏంటి
రాబోయే ఐదేళ్లలో 20,000 స్టార్టప్‌లను స్థాపించి, కనీసం లక్ష మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024-29'ను విడుదల చేసింది.
స్టార్టప్‌లు స్థాపించేవారికి, ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్‌లకు, ఇంకా ఇంక్యుబేటర్లకు ప్రభుత్వ ఆర్థిక, ఆర్థికేతర సహాయాన్ని అందించనుంది.
ఈ నిధులను పొందేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది.
సోమవారం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ (ITE&C) ప్రమోషన్ వింగ్ ముఖ్య కార్యదర్శి భాస్కర్ కాటమనేని ఈ పాలసీ విధివిధానాలను విడుదల చేశారు.
వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లో స్టార్టప్‌ల ప్రగతి
దేశవ్యాప్తంగా 2024 డిసెంబరు నాటికి 1.5 లక్షల స్టార్టప్‌లు ఉండగా, 2015 నుంచి ఏటా 120% వృద్ధి నమోదవుతోంది.
ప్రస్తుతం దేశంలోని 80% జిల్లాల్లో స్టార్టప్‌లు విస్తరించాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 6,658 స్టార్టప్‌లు ఉండగా, వాటిలో 1,158 మహిళలు స్థాపించినవే. ఈ 6,658 స్టార్టప్‌లలో 2,400 డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) వద్ద నమోదయ్యాయి.
2022 ర్యాంకింగ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ రంగంలో 'లీడర్'గా ఎదిగింది.
వివరాలు
స్టార్టప్ హబ్‌ల అభివృద్ధి
స్టార్టప్ హబ్‌లలో పెరుగుతున్న ఖర్చుల కారణంగా, భవిష్యత్తులో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, తిరుపతి, అనంతపురం, కర్నూలు నగరాలు స్టార్టప్‌లకు ప్రధాన కేంద్రాలుగా మారే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 46 ఇంక్యుబేటర్లు ఉన్నాయి. వీటిలో 9 ప్రభుత్వ సంస్థలు, ఒక ప్రైవేట్ సంస్థ, మిగతావన్నీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు నిర్వహిస్తున్నవి.
6 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు:
ఐఓటీ అండ్ ఏఐపై ఆంధ్ర విశ్వవిద్యాలయం
రూరల్ ఇన్నోవేషన్‌లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
మారిటైమ్ షిప్పింగ్‌పై కాకినాడలోని నౌకాశ్రయాల మంత్రిత్వ శాఖ
ఇండస్ట్రీ 4.0పై విశాఖపట్నంలోని కల్పతరు ఎస్టీపీఐ
బయోటెక్, మెడికల్ డివైజ్‌ల తయారీపై ఏఎంటీజడ్ పనిచేస్తున్నాయి.
వివరాలు
2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు
రాష్ట్రంలోని ఉద్యోగ అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
ఇప్పటివరకు కుదిరిన ఒప్పందాల ద్వారా రూ. 8.73 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, వీటి ద్వారా 5,27,824 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.
సోమవారం, మంత్రి లోకేశ్ నివాసంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో ఈ అంశాలపై చర్చ జరిగింది.
సమావేశంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, పి.నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర తదితరులు హాజరయ్యారు.
వివరాలు
పెట్టుబడుల ట్రాకింగ్, అనుమతులు:
లోకేశ్ అధికారులతో మాట్లాడుతూ, ఇన్వెస్ట్‌మెంట్ ట్రాకర్ పోర్టల్ను సమర్థంగా అభివృద్ధి చేయాలని సూచించారు.
భూ కేటాయింపులు, అనుమతుల వంటి అన్ని వివరాలను ట్రాకర్‌లో నమోదు చేయాలని తెలిపారు.
అంతే కాకుండా, రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.