Andhrapradesh: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్
2024-25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ కొనుగోళ్లు వికేంద్రీకరణ విధానంలో జరుగుతాయని, రైతు సేవా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ-పంట, ఈ కేవైసీ ద్వారా రైతుల, కౌలు రైతుల వివరాలు నమోదు చేసి, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సులభతరం చేయాలని సూచించింది. అలాగే, ఆధార్ అనుసంధానం ద్వారా ఇ-పంట, ఈ-కేవైసీ వ్యవస్థల ద్వారా రైతుల ఖాతాల్లోకి కొనుగోళ్ల చెల్లింపులు జరపాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి.
ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో రైస్ మిల్లర్లు వివరాలు నమోదు చేయాలి
ధాన్యం కొనుగోళ్ల నిర్వహణకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, ఏపీ మార్క్ ఫెడ్ సంస్థలను నోడల్ సంస్థలుగా నియమిస్తూ జీవో జారీ చేసింది. రైస్ మిల్లర్లు కూడా ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్ధతు ధర ప్రకారం, కామన్ వెరైటీకి క్వింటాలుకు రూ.2300, గ్రేడ్ ఏ రకానికి రూ.2320 చెల్లించాలని ఆదేశాలు వచ్చాయి. 2024-25 ఖరీఫ్ సీజన్‌లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించారని ప్రభుత్వం వెల్లడించింది. సేకరణతో పాటు మిల్లింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్లు, జేసీలకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.