AP Dwakra Mahilalu : డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ శుభవార్త.. పరిశ్రమల ఏర్పాటు- భారీ రాయితీతో రుణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్తను ప్రకటించింది. డ్వాక్రా మహిళలను ఉత్సాహిత పారిశ్రామికవేత్తలుగా తయారుచేయడం కోసం తొలి విడతలో రూ.55 కోట్లతో 129సూక్ష్మ,చిన్న పరిశ్రమలను స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ పరిశ్రమలను నవంబర్ రెండో వారంలో ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.5 లక్షల నుండి రూ.60లక్షల వరకు ఉండబోతుంది. దీని ద్వారా మహిళలకు ఉపాధి కల్పించబడుతుంది.మొత్తం వ్యయానికి 35శాతం ప్రభుత్వం సబ్సిడీగా అందించగా,10శాతం లబ్ధిదారుల వాటా,మిగతా మొత్తం బ్యాంకుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రుణంగా అందిస్తుంది. ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వ పథకాలు అయిన పీఎంఎఫ్‌ఎమ్‌ఈ, పీఎంఈజీపీలకు అనుసంధానిస్తారు. తొలి విడతలో అమలుపడిన ప్రాజెక్టులపై ఆధారపడి రెండో విడతలో మరో 13,000మందికి లబ్ధి చేకూర్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
కొత్తగా 64 మంది మహిళలు పరిశ్రమలు
ప్రస్తుతం ప్రభుత్వం ఆసక్తి చూపించిన వ్యక్తులకు తొలి విడతలో 129 సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేయడం కోసం కేటాయించింది. వీరిలో 64 మంది మహిళలు కొత్తగా పరిశ్రమలు స్థాపిస్తుండగా, 65 మంది ఇప్పటికే ఉన్న వ్యాపారాలను మరింత విస్తరించుకోబోతున్నారు. త్వరలో ప్రారంభించబోతున్న పరిశ్రమల్లో... జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు, బెల్లం ఉత్పత్తి, ఆయిల్ మిల్లు, హైజిన్ ప్రొడక్ట్స్, మిల్లెట్ ,హెర్బల్ యూనిట్, బేకరీ, స్నాక్స్ యూనిట్, డెయిరీ ఫాం, కిరాణా షాపులు, పచ్చళ్ళ తయారీ, సిమెంట్ బ్రిక్స్ యూనిట్, ఎంబ్రాయిడరీ, ఐస్‌క్రీమ్ తయారీ, గార్మెంట్స్, తేనే తయారీ, కారంపొడి తయారీ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.
సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యాలు
ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఇప్పటికే పూర్తి చేసి,బ్యాంకుల నుండి రుణాలను కూడా మంజూరు చేయడం జరిగింది. లబ్దిదారులు తమ వ్యాపారాల అవసరాలకు ఈ రుణాలను ఉపయోగిస్తున్నారు.రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లబ్దిదారులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు డ్వాక్రా సంఘాల్లో మహిళలు పొదుపుకు పరిమితమయ్యారు.కానీ వారికి మరింత ప్రోత్సాహం అందిస్తే సూక్ష్మ, చిన్న పరిశ్రమల్లో విజయం సాధిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు చిరు వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో డ్వాక్రా మహిళల పాత్రను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య,ఆహార శుద్ధి,ఎంఎస్‌ఎంఈ, రైల్వే, నేషనల్ హైవేలు వంటి విభాగాల్లో డ్వాక్రా మహిళలను భాగస్వాములుగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశిస్తోంది.
బ్యాంకుల ద్వారా చిన్న మొత్తాల్లో రుణాలు
ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామిక వేత్త అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారుచేస్తోంది. ఈ సందర్భంగా నాబార్డు నిధులను వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ నిధుల ద్వారా మహిళలకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించబడవచ్చు. డ్వాక్రా మహిళలకు బ్యాంకుల ద్వారా చిన్న మొత్తాల్లో రుణాలు అందించబడుతున్నాయి. ఇవి కుటుంబ అవసరాల కోసం వినియోగించబడుతున్నాయి. ఈ రుణాల పరిమాణాన్ని పెంచి, మహిళలను ఉత్సాహిత పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నాయి.