LOADING...
Andhra Pradesh: హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పనులకు రూ.775.83 కోట్లు మంజూరు
హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పనులకు రూ.775.83 కోట్లు మంజూరు

Andhra Pradesh: హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పనులకు రూ.775.83 కోట్లు మంజూరు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2026
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రాజెక్ట్ ఫేజ్-1,ఫేజ్-2 పనుల కోసం మొత్తం రూ.775.83 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు సీఎస్‌, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఫేజ్-1లో భాగంగా ప్యాకేజీ 36ఎ పరిధిలో 188.200కి.మీ వద్ద ప్రధాన కాలవలో మిగిలిన పనులు, ఫీడర్ కెనాల్ తవ్వకం,ఆఫ్‌టేక్ స్లూయిస్ నిర్మాణానికి రూ.606.03 కోట్లు కేటాయించారు. ఇందులో అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పేరూరు బ్రాంచి కాలవకు రూ.601.50కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 0.0 కి.మీ నుంచి 6.070 కి.మీ వరకు పనులు చేపడతారు. అలాగే హగరి బ్రాంచి కెనాల్‌ను 0.0 కి.మీ నుంచి 27.500 కి.మీ వరకు అభివృద్ధి చేయనున్నారు.

వివరాలు 

ఫేజ్-2 ఆధునికీకరణకు సవరించిన పరిపాలనా అనుమతులు

మాల్యం బ్రాంచి కాల్వలో 7ఆర్ డిస్ట్రిబ్యూటరీ, డీ2 నుంచి 8ఆర్ డిస్ట్రిబ్యూటరీల వరకు పనులతో పాటు 55,608 ఎకరాల ఆయకట్టు అభివృద్ధి కోసం సర్వేలు, హైడ్రాలిక్ వివరాలు, డిజైన్ తయారీకి నిధులు వినియోగిస్తారు. లతవరం తండా,షేక్షానపల్లి కుంట,రాచర్లకుంటలకు నీటి సరఫరా కోసం ప్రధాన కాలవ 188.200 కి.మీ వద్ద ఆఫ్‌టేక్ స్లూయిస్ నిర్మాణం సహా ఇతర పనులకు రూ.4.53 కోట్లు కేటాయించారు. ఫేజ్-2లో ఆధునికీకరణ కార్యక్రమంలో భాగంగా పుంగనూరు బ్రాంచి కాలవ నిర్మాణం,కాంక్రీట్ లైనింగ్ పనులకు ప్రభుత్వం సవరించిన పరిపాలనా అనుమతులు ఇచ్చింది. 0.0 కి.మీ నుంచి 22.200 కి.మీ (చెర్లోపల్లి జలాశయం వరకు) మిగిలిన పనుల కోసం రూ.169.80 కోట్లను మంజూరు చేసింది.

వివరాలు 

చెరువుల పునరుద్ధరణకు నిధులు

ఈ నిధులను హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్ట్‌లోని పొదుపు నుంచి సర్దుబాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇక 'హర్ ఖేత్ కో పానీ' పథకం కింద రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణకు కూడా నిధులు కేటాయించింది. మొత్తం రూ.67.18 కోట్లతో 129 చెరువులను పునరుద్ధరించేందుకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. ప్రకాశం, మార్కాపురం, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఈ పనులు చేపట్టేందుకు సీఎస్ జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement