
Nara Lokesh: టాటా గ్రూపు ఛైర్మన్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ.. సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ముంబయిలో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ నెలలో విశాఖపట్నంలో నిర్వహించనున్న టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని టాటా ప్రతినిధులను ఆయన ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సమగ్ర అభివృద్ధి ప్రక్రియలో టాటా గ్రూప్ కూడా భాగస్వామ్యం కావాలని, రాష్ట్రంలోని అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి తోడ్పడాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టాటా సంస్థలకు చెందిన పలువురు కీలక అధికారులు హాజరయ్యారు.
వివరాలు
సమావేశంలో పాల్గొన్న టాటా సంస్థలకు చెందిన పలువురు కీలక అధికారులు
వారిలో టాటా పవర్ రిన్యూవబుల్స్ సీఈఓ సంజయ్ కుమార్ బంగా,ఇండియా హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ ఛత్వాల్, టాటా ఎలక్సి సీఈఓ మనోజ్ రాఘవన్, టాటా ఆటోకాంప్ సీఈఓ మనోజ్ కోల్హాత్కర్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సీఈఓ సుకరన్ సింగ్, టాటా ఎలక్ట్రానిక్స్ ఎండీ రణధీర్ ఠాకూర్, టాటా కెమికల్స్ ఎండీ ఆర్. ముకుందన్, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సీఈఓ వినాయక్ పాయ్, అలాగే ఎస్‌టీ టెలీమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ సీఈఓ బిమల్ ఖండేల్వాల్ ఉన్నారు.
వివరాలు
పోర్టు ఆధారిత లాజిస్టిక్స్‌లో పెట్టుబడులు
అదేవిధంగా, లోకేశ్ ముంబయిలోని తాజ్ ల్యాండ్స్ హోటల్‌లో గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ ఈఎస్ఆర్ గ్రూప్ (ESR Group) ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ సాదత్ షా, డైరెక్టర్ (లీజింగ్) ప్రకృత్ మెహతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సముద్ర ఎగుమతుల అభివృద్ధికి సంబంధించి కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు, గిడ్డంగుల నిర్మాణం, అలాగే పోర్ట్ ఆధారిత లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని లోకేశ్ వారిని కోరారు.