Loading...
Andhra Pradesh: అమరావతి,శ్రీకాకుళం,కుప్పం ఎయిర్‌పోర్టులకు టీఈఎఫ్‌ఆర్‌లు సిద్ధం.. తొలి దశకు రూ.5,545 కోట్లు
తొలి దశకు రూ.5,545 కోట్లు

Andhra Pradesh: అమరావతి,శ్రీకాకుళం,కుప్పం ఎయిర్‌పోర్టులకు టీఈఎఫ్‌ఆర్‌లు సిద్ధం.. తొలి దశకు రూ.5,545 కోట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 12, 2026
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. అమరావతి, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లా కుప్పం విమానాశ్రయాలకు సంబంధించిన టెక్నో ఎకనమిక్‌ ఫీజిబులిటీ రిపోర్ట్‌ (టీఈఎఫ్‌ఆర్‌)లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఈ విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించే ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సైట్‌ క్లియరెన్స్‌ల కోసం రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) అధికారులు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (మోకా)కు ప్రతిపాదనలు పంపారు. మోకా నుంచి అనుమతులు వచ్చిన వెంటనే డీపీఆర్‌లు రూపొందించేందుకు సంస్థలను ఎంపిక చేయాలని ఏపీఏడీసీఎల్‌ భావిస్తోంది.

వివరాలు 

తొలి దశకు రూ.5,545 కోట్లు

రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సుమారు గంట ప్రయాణంలో విమానాశ్రయాన్ని చేరుకునేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో 9 జిల్లాల్లో కొత్త ఎయిర్‌పోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా తొలి దశలో అమరావతి, శ్రీకాకుళం, కుప్పం విమానాశ్రయాల నిర్మాణం, వాటికి అవసరమైన భూసేకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

మొదటి దశలో ఈ మూడు ప్రాజెక్టులకు కలిపి రూ.5,545 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

అవసరమైన నిధుల్లో కొంత మొత్తాన్ని హడ్కో నుంచి రుణంగా సమీకరించేందుకు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.

వివరాలు 

అమరావతి విమానాశ్రయం.. పీపీపీ విధానంలో

అమరావతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పీపీపీ-డీబీఎఫ్‌వోటీ (డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌) విధానంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రతిపాదించింది.

మొదటి దశ నిర్మాణానికి రూ.4,419 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది.

విమానాశ్రయం కోసం అవసరమైన 4,618 ఎకరాలను భూ సమీకరణ విధానంలో సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

అలాగే రూ.1,087 కోట్లతో ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయనుంది.

ఇందులో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది.

ADVERTISEMENT

వివరాలు 

శ్రీకాకుళంలో ఏఏఐ భాగస్వామ్యంతో..

శ్రీకాకుళం జిల్లాలో ప్రతిపాదించిన విమానాశ్రయం మొదటి దశను రూ.392 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ ప్రాజెక్టును ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) భాగస్వామ్యంతో చేపట్టేందుకు ప్రతిపాదించింది.

ఇందుకు సంబంధించిన రాయితీ ఒప్పందాన్ని ఏఏఐ పరిశీలన కోసం పంపింది. విమానాశ్రయ నిర్మాణం కోసం మొత్తం 1,185.86 ఎకరాలను గుర్తించారు.

వీటి భూసేకరణకు సంబంధించిన ఉత్తర్వులను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది.

భూసేకరణ కోసం రూ.213 కోట్లు, ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధికి రూ.320.90 కోట్లు అవసరమని అంచనా వేసింది.

ఇందులో రూ.237.55 కోట్లను హడ్కో నుంచి రుణంగా తీసుకునేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

ADVERTISEMENT

వివరాలు 

కుప్పంలో క్యాపెక్స్‌ విధానంలో..

చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్మించనున్న విమానాశ్రయం మొదటి దశకు రూ.734 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం మొత్తం 1,788 ఎకరాలను గుర్తించింది. ఇందులో ఇప్పటికే 1,300 ఎకరాలను సేకరించింది.

కుప్పం విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ కోసం రూ.198.75 కోట్లు, ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధికి రూ.146.73 కోట్లు ఖర్చు చేయనుంది.

ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో రూ.313.25 కోట్లను హడ్కో నుంచి రుణంగా తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

అంతేకాకుండా రూ.100 కోట్లతో రహదారుల నిర్మాణానికి గుత్తేదారులకు ఇప్పటికే అనుమతులు ఇచ్చింది.

వివరాలు 

ఆపరేషన్‌, నిర్వహణకు ఎన్‌వోసీ

రాష్ట్ర ప్రభుత్వం భరించే క్యాపెక్స్‌లో 15 శాతం మార్జిన్‌ ప్రాతిపదికన విమానాశ్రయ నిర్వహణ, కార్యకలాపాలను చేపట్టేందుకు బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ ముందుకొచ్చింది.

ఈ మేరకు షరతులతో కూడిన నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ)ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (మోకా)కు సమర్పించింది.

ADVERTISEMENT