Loading...
AP Municipalities: ఏపీ మున్సిపాలిటీల అభివృద్ధికి భారీ నిధులు.. రూ.7,469 కోట్ల విడుదల
ఏపీ మున్సిపాలిటీల అభివృద్ధికి భారీ నిధులు.. రూ.7,469 కోట్ల విడుదల

AP Municipalities: ఏపీ మున్సిపాలిటీల అభివృద్ధికి భారీ నిధులు.. రూ.7,469 కోట్ల విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2026
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మున్సిపాలిటీల అభివృద్ధి నిధుల కింద ఏకంగా రూ.7,469.46 కోట్లను విడుదల చేసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులను గణనీయంగా మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ నిధులతో వివిధ అభివృద్ధి పనులను వేగంగా చేపట్టనున్నారు.

వివరాలు 

రోడ్లు, డ్రైనేజీలకు పెద్దపీట

పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

ఇందులో భాగంగా రూ.4,655.82 కోట్ల అంచనా వ్యయంతో కొత్త రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను నిర్మించనున్నారు.

మొత్తం 4,308 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణ పనులు చేపట్టి పట్టణ ప్రాంతాల్లో 100 శాతం కనెక్టివిటీ సాధించాలని నిర్ణయించారు.

నెల రోజుల్లోగా ఈ పనులన్నింటినీ ప్రారంభించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

వివరాలు 

పార్కులు, వీధి దీపాలతో కొత్త రూపు

పట్టణాల అభివృద్ధిని కేవలం రోడ్లు, డ్రైనేజీలకే పరిమితం చేయకుండా సుందరీకరణకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది.

నగరాలు, పట్టణాలను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది.

ఇందులో భాగంగా సుమారు రూ.509.12 కోట్లతో 541 కొత్త పార్కులను అభివృద్ధి చేయనున్నారు.

అదేవిధంగా పట్టణాల్లో వెలుతురు సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూ.247.28 కోట్ల వ్యయంతో 20,340 కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేయనున్నారు.

రహదారుల మధ్యలో మొక్కలు నాటి పట్టణాల రూపురేఖలను మార్చేందుకు మరో రూ.87.78 కోట్లను ఖర్చు చేయనున్నారు.

ఈ సుందరీకరణ పనులతో పట్టణ ప్రాంతాలు మరింత ఆకర్షణీయంగా మారేలా చర్యలు చేపట్టనున్నారు.

ADVERTISEMENT