Loading...
Andhra Pradesh: ఏపీ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి కొన్ని చోట్ల ఆధిక్యం
వైసీపీకి కొన్ని చోట్ల ఆధిక్యం

Andhra Pradesh: ఏపీ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి కొన్ని చోట్ల ఆధిక్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2026
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులు ఎక్కువ స్థానాలను గెలుచుకున్నారు. పార్టీ గుర్తులు లేకుండా బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు కూటమి మద్దతుదారుల వైపు మొగ్గు చూపినట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. తొలి విడతలో మొత్తం 3,949 గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టగా, వీటిలో 760 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో కూటమి మద్దతుదారులు మొత్తం 2,539 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు 2,325స్థానాల్లో విజయం సాధించారు. జనసేన మద్దతుదారులు 189పంచాయతీలను,బీజేపీ మద్దతుదారులు 25పంచాయతీలను దక్కించుకున్నారు.

వివరాలు 

1,110 పంచాయతీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 1,110 పంచాయతీల్లో గెలుపొందారు.

ఇతర పార్టీలు, స్వతంత్రులు, రెబల్ అభ్యర్థులు కలిపి మరో 294 స్థానాలను సొంతం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి మద్దతుదారులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించినప్పటికీ, కొన్ని జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు.

వివరాలు 

కొన్ని జిల్లాల్లో వైసీపీకి మెరుగైన ఫలితాలు

జిల్లాల వారీగా ఫలితాలను పరిశీలిస్తే తిరుపతి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎక్కువ పంచాయతీలను గెలుచుకున్నారు.

మొత్తం 404 పంచాయతీలు ఉన్న ఈ జిల్లాలో వైసీపీ అభ్యర్థులు తమ ఆధిక్యాన్ని ప్రదర్శించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ రెండు పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది.

ఇక్కడ మొత్తం 66 పంచాయతీలకు గాను వైసీపీ మద్దతుదారులు 29 స్థానాల్లో, కూటమి అభ్యర్థులు 26 స్థానాల్లో విజయం సాధించారు.

కృష్ణా, ఏలూరు జిల్లాలతో పాటు గన్నవరం ప్రాంతంలోనూ వైసీపీ అభ్యర్థులు కూటమికి గట్టి పోటీ ఇచ్చారు.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి మద్దతుదారులు ఎక్కువ స్థానాలను సాధించినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం వైసీపీ తన పట్టును నిలబెట్టుకుంది.

ADVERTISEMENT

వివరాలు 

జగన్ సొంతూరులో టీడీపీ అభ్యర్థి విజయం

రాయలసీమ ప్రాంతంలో తిరుపతి జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లో కూటమి మద్దతుదారులు ఎక్కువ స్థానాలను గెలుచుకున్నారు.

ఈ ఎన్నికల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంతూరు బలపనూరులో తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఫలితం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు 

ఎన్నికల ఫలితాలపై జగన్ ఆరోపణలు

పంచాయతీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు.

అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా దుర్వినియోగం చేసి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసిందని ఆయన ఆరోపించారు.

మరోవైపు ఎన్నికల ఫలితాలపై కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, అందుకే గ్రామీణ ప్రాంతాల్లో తమ మద్దతుదారులకు ఓటర్లు అండగా నిలిచారని కూటమి వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నవంబర్ 29న జరగనున్నాయి.

దీంతో తదుపరి విడతలో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT