
ఒకే ఫోటోతో 658 సిమ్‌కార్డులు జారీ.. దర్యాప్తునకు కేంద్ర సమాచార శాఖ ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుణదలలో ఒకే ఫొటోతో 658 సిమ్ కార్డులు జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ (DOT) ఈ మేరకు గుర్తించింది.
అనంతరం ఈ విషయాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ అంశంపై విచారణ చేపట్టాలని సూర్యారావుపేట పోలీసులను కమిషనర్ కాంతిరాణా ఆదేశించారు.
ఒకే ఫొటోతో ఓ నెట్‌వర్క్ సంస్థకు సంబంధించిన సుమారు 658 సిమ్ కార్డులను అమ్మినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సత్యనారాయణపురానికి చెందిన పోలుకొండ నవీన్ వీటిని తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు.
మరోవైపు అజిత్‌సింగ్ నగర్, విస్సన్నపేట ఠాణాల పరిధిలోనూ ఇదే మాదిరిగా నకిలీ పత్రాలతో 150 చొప్పున సిమ్‌కార్డులను పొందినట్లు నిగ్గు తేల్చారు.
DETAILS
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహకారంతో బట్టబయలు
సిమ్ కార్డ్ మోసాలను అరికట్టేందుకు భారత సమాచార శాఖ కృత్రిమ మేధస్సు(AI)తో పనిచేసే ఓ సాంకేతికతను ఏర్పాటు చేసింది. దీంట్లో భాగంగానే అక్రమ సిమ్ కార్డుల విషయం బహిర్గతమైంది.
ASTR(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫేసియల్ రికగ్నేషన్ పవర్డ్ సొల్యూషన్ ఫర్ టెలికాం సిమ్ సబ్‌స్క్రైబర్ వెరిఫికేషన్) సిమ్‌కార్డ్ మోసాలను గుర్తిస్తుంది. అనంతరం సంబంధిత నంబర్లను నిలుపదల(బ్లాక్) చేస్తోంది.
టెలికాం ఆపరేటర్ల నుంచి సిమ్‌కార్డుదారుల ఫోటోలను తీసుకుని, డాట్ శాఖ ఏఐ సాఫ్ట్ వేర్ ద్వారా పోల్చి చూస్తుంది. దీంతో ఒకే ఫొటోతో పెద్ద ఎత్తున సిమ్‌లు తీసుకున్న సంగతి బట్టబయలైంది.
నకిలీ పత్రాలతో తీసుకున్న సిమ్‌కార్డులు అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడితే విపరీత పరిణామాలు జరిగే ప్రమాదం ఉన్నట్లు డాట్ ఆందోళన వ్యక్తం చేసింది.