AP SIPB: చంద్రబాబు సమక్షంలో SIPB కీలక నిర్ణయాలు.. రూ.39,436 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం రూ.39,436 కోట్ల విలువైన 31 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల అమలుతో ప్రత్యక్షంగా సుమారు 1,11,278 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని అధికారులు తెలిపారు. అమరావతి క్వాంటం వ్యాలీలో మూడు సంస్థల స్థాపనకు కూడా బోర్డు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సూచించారు.
వివరాలు
సౌరవిద్యుత్ కేంద్రంగా రాయలసీమ
ఇక వ్యవసాయ వ్యర్థాలను సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయడానికి SIPB గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పారిశ్రామిక ప్రాజెక్టులు ఆధునిక భద్రతా ప్రమాణాలతో నిర్మించాలనే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. రాయలసీమ ప్రాంతాన్ని సౌరవిద్యుత్ కేంద్రంగా అభివృద్ధి చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 325 గిగావాట్ల సౌరశక్తి ఉత్పత్తి సామర్థ్యం ఉన్నట్లు అధికారులు వివరించారు. భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించాలని చంద్రబాబు సూచించారు.