Andhra Pradesh: ఏపీలో మూడు పారిశ్రామిక నోడ్‌లు.. రూ.31వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. విశాఖపట్నం-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల పరిధిలో ప్రతిపాదించిన పారిశ్రామిక నోడ్‌లలో మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసింది. ఈ మూడు నోడ్‌ల ద్వారా మొత్తం రూ.31,300 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ పారిశ్రామిక నోడ్‌ల అభివృద్ధి కోసం మొత్తం 29,254 ఎకరాలకు మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో తొలి దశగా 7,225 ఎకరాల్లో రహదారులు, విద్యుత్, నీటి సరఫరా, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ మూడు నోడ్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 1.95 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
వివరాలు
కొప్పర్తి నోడ్‌లో..
రాయలసీమలో పారిశ్రామిక వృద్ధికి ఊతమివ్వాలనే ఉద్దేశంతో వైఎస్సార్ కడప జిల్లాలోని కొప్పర్తిలో పారిశ్రామిక నోడ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. తొలి దశలో 2,596 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టారు. దశలవారీగా దీని విస్తీర్ణాన్ని 6,740 ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కొప్పర్తి నోడ్ ద్వారా రూ.8,800 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 54 వేల మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), డ్రోన్ తయారీ, వస్త్ర పరిశ్రమలకు అనువుగా ఈ పారిశ్రామిక నోడ్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
వివరాలు
కృష్ణపట్నం మొదటిదశ..
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్ తొలి దశ పనులు 2,008 ఎకరాల్లో కొనసాగుతున్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.1,173 కోట్లను వెచ్చిస్తోంది. ఇప్పటివరకు సుమారు 35 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ నోడ్ ద్వారా రూ.10,500 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలు, కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానం వంటి ప్రత్యేకతలతో భారీ ఉత్పాదక పరిశ్రమలకు అనువుగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంజినీరింగ్, యంత్రాల తయారీ, ఔషధాలు, ఫుడ్ ప్రాసెసింగ్, వస్త్ర పరిశ్రమలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.
వివరాలు
మొదటి బహుళ కారిడార్ ఓర్వకల్లు
హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పారిశ్రామిక నోడ్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. తొలి దశలో 2,621 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని ప్రతిపాదించింది. రాష్ట్రంలో తొలి బహుళ కారిడార్ నమూనాలో అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక నోడ్‌గా దీనికి ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఓర్వకల్లు నోడ్ ద్వారా రూ.12,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 45 వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అంచనా. భవిష్యత్తులో దశలవారీగా 9,718 ఎకరాలకు విస్తరించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నోడ్‌లో భాగంగా డ్రోన్ సిటీ ఏర్పాటు ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.