
Andhra News: ఒకేచోట ఐదేళ్లు పూర్తయిన సచివాలయ ఉద్యోగులకు స్థానచలనం.. మార్గదర్శకాల్లో స్పష్టం చేసిన ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగులకు వారి సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వవద్దని స్పష్టం చేసింది. గురువారం విడుదలైన అధికారిక మార్గదర్శకాల్లో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొంది. 2025 మే 31 నాటికి ఒకే సచివాలయంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగుల బదిలీ తప్పనిసరిగా నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ బదిలీ ప్రక్రియకు సంబంధించిన వివరాలను జులై 10వ తేదీలోగా హెచ్‌ఆర్‌ఎంఎస్ (HRMS) పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని పేర్కొంది.
వివరాలు
జూన్ 30 లోపు బదిలీ ప్రక్రియ
బదిలీలు పూర్తయ్యాక, ఒక సచివాలయంలో అవసరానికి మించి ఉన్న ఉద్యోగులు తాత్కాలికంగా అదే చోట కొనసాగనున్నారు. వారికి తదుపరి సూచనలు వెలువడే వరకు అక్కడే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి సంబంధిత జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు కేటాయించబడ్డాయి. ఇక ఈ మొత్తం బదిలీ ప్రక్రియను జూన్ 30 లోపు పూర్తిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వివరాలు
బదిలీల్లో వీరికి ప్రాధాన్యం
ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు ఈ బదిలీల్లో ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తోంది. ఈ మేరకు క్రింది కేటగిరీల్లోకి వచ్చే వారు ప్రాధాన్యంగా పరిగణించబడతారు: అంధులు మానసిక వికలాంగులైన పిల్లల తల్లిదండ్రులు గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకుపైగా పనిచేసిన వారు 40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్నవారు క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి సమస్యలు ఉన్నవారు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే వీలైనంత వరకు సమీప ప్రాంతాల్లో వారిని నియమించాలి వీరందరివీ రిక్వస్ట్ ట్రాన్స్‌ఫర్లుగా పరిగణించి ప్రయాణ భత్యాలు వర్తింపజేయాలి ఐటీడీఏల్లో మొదట ఖాళీలు నింపాలి అంతర్గత, వెనుకబడిన ప్రాంతాల్లో ఖాళీల భర్తీకి ప్రాధాన్యమివ్వాలి
వివరాలు
హేతుబద్ధీకరణ, బదిలీలు ఒకేసారి..
ఐటీడీఏ ప్రాంతాల నుంచి బదిలీ అయిన వారి స్థానంలోకి వేరొకరు వచ్చి చేరాకే రిలీవ్ చేయాలి గ్రామ, వార్డు సచివాలయాల హేతుబద్ధీకరణను బదిలీల ప్రక్రియతో సమకాలీనంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన జీవోలు (నంబర్లు 1, 3, 4) ఆధారంగా బదిలీలు చేయాలని కలెక్టర్లకు సూచించింది. సచివాలయాలను జనాభా పరంగా 'ఏ', 'బీ', 'సీ' కేటగిరీలుగా విభజించారు: 'ఏ' కేటగిరిలో 6 మంది ఉద్యోగులు 'బీ' కేటగిరిలో 7 మంది 'సీ' కేటగిరిలో 8 మంది ఈ ఉద్యోగులను టెక్నికల్, జనరల్ పర్పస్ ఫంక్షనరీలుగా గుర్తించనున్నారు. కలెక్టర్లు ఈ మార్గదర్శకాల ప్రకారం బదిలీలను అమలు చేయాల్సి ఉంటుంది.
వివరాలు
డిప్యుటేషన్లపై మిగులు ఉద్యోగులు
బదిలీలు,హేతుబద్ధీకరణ పూర్తయ్యాక సచివాలయాల్లో మిగిలిపోయే ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు డిప్యుటేషన్‌పై పంపించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13,000 నుంచి 15,000 మంది మిగులు ఉద్యోగులు ఉండొచ్చని అంచనా. ప్రస్తుతానికి వీరంతా తమ సచివాలయాలకే పరిమితం కానున్నారు. తదుపరిలో, ఇతర ప్రభుత్వ విభాగాల్లో అవసరాన్ని బట్టి వారిని దశలవారీగా డిప్యుటేషన్‌కు పంపే ఏర్పాట్లు చేస్తారు. గత వైకాపా ప్రభుత్వంలో ఒక్కో సచివాలయంలో 8 నుంచి 12 మంది వరకు ఉద్యోగులను నియమించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ సంఖ్యను 6 నుంచి 8కి తగ్గించింది. పోస్టింగ్‌పై ఉద్యోగ సంఘాల అభ్యర్థనలు సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వవద్దనే నిబంధనను రద్దు చేయాలని కొన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని వేర్వేరు ప్రకటనల ద్వారా అభ్యర్థించారు.