Chandrababu: వచ్చే ఏడాది జూన్ నాటికి 'ఏపీ' ప్లాస్టిక్ రహిత రాష్ట్రం : సీఎం చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యం లేకుంటే అది తాత్కాలికంగానే మిగులుతుందని, ప్రజలు భాగస్వాములైతేనే ఆ కార్యక్రమాలు శాశ్వత ఫలితాలు ఇస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా తాళ్లపాలెంలో నిర్వహించిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై నివేదిక ఇవ్వాలని గతంలో ప్రధాని కోరారని, ఆయన అభ్యర్థన మేరకు తాము సమగ్ర నివేదికను అందజేశామని సీఎం తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలోనే రాష్ట్రంలో అనేక కీలక మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు.
Details
ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. యూజ్ - రికవరీ - రీయూజ్ విధానంతో ముందుకు వెళ్తున్నాం. వాడిన ప్లాస్టిక్‌ను ఇచ్చిన వారికి డబ్బు అందించేలా చర్యలు చేపడుతున్నాం. వ్యర్థాలను వనరులుగా, ఆస్తులుగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉత్తమ సేవలందించే పారిశుద్ధ్య కార్మికులను ప్రోత్సహించేందుకు అవార్డులు అందజేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని సీఎం ప్రకటించారు. ఇప్పటికే సచివాలయాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వం వదిలిన 86 లక్షల టన్నుల చెత్తను తొలగించినట్లు వెల్లడించారు. రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తూ వ్యర్థాల నిర్వహణను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
Details
26 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు
జనవరి 26 నాటికి రాష్ట్రంలో ఏ రోడ్డుపైనా చెత్త కనిపించకూడదు. ప్రస్తుతం 26 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు పనిచేస్తున్నాయి. అవసరమైతే 100 స్వచ్ఛ రథాలు ఏర్పాటు చేసి పొడిచెత్త సేకరణ చేపడతాం. మీరు ఇచ్చే పొడిచెత్తకు డబ్బు కూడా చెల్లిస్తామని సీఎం తెలిపారు. ఇంట్లో ఊడ్చిన చెత్తను రోడ్లపై వేయడం పూర్తిగా మానుకోవాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు. అందరిలో సామాజిక స్పృహ పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. 'రోడ్లు కూడా మనవే. పట్టణ ప్రాంతాల్లో డోర్ టు డోర్ చెత్త సేకరణ జరుగుతోంది. ఇంట్లోనే చెత్తను కంపోస్ట్‌గా తయారు చేసుకోవచ్చని వివరించారు.