Best Tourism Promotion State: జీఎంటీ-2026లో ఏపీకి 'ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం' అవార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ పర్యాటక రంగానికి మరో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ (జీఎంటీ) 2026 సంవత్సరానికి ప్రకటించిన 'ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం' అవార్డును ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అందుకున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ఆయన స్వీకరించారు. కేరళ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి పీసీ విశ్వనాథ్, ఎమ్మెల్యే మురళీధరన్, తిరువనంతపురం మేయర్ వీవీ రాజేశ్ చేతుల మీదుగా దుర్గేష్‌కు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పర్యాటకాభివృద్ధి చర్యలకు ఇది గుర్తింపుగా నిలిచిందన్నారు. ప్రభుత్వం, ప్రజల ఉమ్మడి కృషి వల్లే ఈ గౌరవం సాధ్యమైందని పేర్కొన్నారు.
వివరాలు
జీటీఎం-2027 ఎక్స్‌పోకు ఆతిథ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు వివిధ రాయితీలు అందించడం వల్ల రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షితమవుతున్నాయని దుర్గేష్ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, వచ్చే ఏడాది నిర్వహించనున్న జీటీఎం-2027 ఎక్స్‌పోకు ఆతిథ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిర్వాహకులు ఎంపిక చేశారు. దీంతో రాష్ట్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.