Loading...
APFDC: ఏపీఎఫ్‌డీసీకి దేశంలోనే తొలి 'ప్రమాణ్‌' ధ్రువీకరణ పత్రం
ఏపీఎఫ్‌డీసీకి దేశంలోనే తొలి 'ప్రమాణ్‌' ధ్రువీకరణ పత్రం

APFDC: ఏపీఎఫ్‌డీసీకి దేశంలోనే తొలి 'ప్రమాణ్‌' ధ్రువీకరణ పత్రం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 30, 2026
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ) దేశంలోనే తొలిసారిగా 'ప్రమాణ్‌' ధ్రువీకరణ పత్రాన్ని పొందింది. రాష్ట్రంలోని సత్యవేడు,కావలి,నెల్లూరు,నాయుడుపేటతో పాటు ఉమ్మడి ప్రకాశం,కృష్ణా జిల్లాల పరిధిలో ఏపీఎఫ్‌డీసీ సుమారు 33 వేల హెక్టార్లలో యూకలిప్టస్‌ సాగు చేస్తోంది. ఈ తోటలకు తాజాగా 'ప్రమాణ్‌' ధ్రువీకరణ లభించింది. దిల్లీలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ చేతుల మీదుగా ఏపీఎఫ్‌డీసీ అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. అడవులు, కలప, అటవీ ఉత్పత్తులకు ధ్రువీకరణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విశ్వసనీయ, పారదర్శక వ్యవస్థే 'ప్రమాణ్‌'. దీనిని 'ప్రోగ్రామ్‌ ఫర్‌ రికగ్నిషన్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ ఆఫ్‌ సస్టైన్‌బుల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాక్టీసెస్‌ ఫర్‌ ఆగ్రోఫారెస్ట్రీ అండ్‌ నేచురల్‌ ఫారెస్ట్రీ రిసోర్సెస్‌'గా పిలుస్తారు.

వివరాలు 

కాగిత పరిశ్రమకు యూకలిప్టస్‌ కలప సరఫరా 

అటవీ, వ్యవసాయ-అటవీ ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో వాణిజ్య అనుసంధానాన్ని పెంచడం 'ప్రమాణ్‌' ప్రధాన లక్ష్యం.

దీని ద్వారా అటవీ ఉత్పత్తుల నాణ్యత, స్థిరమైన నిర్వహణకు గుర్తింపు లభించడంతో పాటు వాటికి మార్కెట్‌ అవకాశాలు మెరుగుపడనున్నాయి.

ఏపీఎఫ్‌డీసీ నిర్వహిస్తున్న యూకలిప్టస్‌ తోటల నుంచి లభించే కలపను కాగిత పరిశ్రమకు సరఫరా చేస్తారు.

'ప్రమాణ్‌' ధ్రువీకరణ రావడంతో ఈ కలపతో తయారయ్యే ఉత్పత్తులకు మార్కెట్‌లో ప్రీమియం ధర లభించే అవకాశం ఉంటుంది.

ధ్రువీకరణ ప్రక్రియలో భాగంగా యూకలిప్టస్‌ కలపకు ప్రత్యేక హార్మొనైజ్డ్‌ సిస్టమ్‌ కోడ్‌ (హెచ్‌ఎస్‌ కోడ్‌)ను జారీ చేస్తారు.

వివరాలు 

ఏపీఎఫ్‌డీసీ యూకలిప్టస్‌ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో వాణిజ్య అవకాశాలు

హెచ్‌ఎస్‌ కోడ్‌ అంతర్జాతీయంగా వినియోగించే ప్రమాణ కోడ్‌. ఈ కోడ్‌ ఉండటంతో యూకలిప్టస్‌ కలపతో తయారయ్యే ఉత్పత్తులను అంతర్జాతీయ వాణిజ్యంలో సులభంగా ఎగుమతి, దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది.

దీంతో ఏపీఎఫ్‌డీసీ యూకలిప్టస్‌ ఉత్పత్తులకు దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ మరింత వాణిజ్య అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

ADVERTISEMENT