APMDC: విదేశాల్లో మైనింగ్‌కు ఏపీఎండీసీ అడుగులు.. కొత్త ఖనిజ వనరులపై దృష్టి
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) తన కార్యకలాపాలను విదేశాలకు విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం తిరుపతి జిల్లా మంగంపేటలోని ముగ్గురాయి (బారైట్స్) గనులే సంస్థకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. అయితే అక్కడ ఉన్న ఎ,బి గ్రేడ్ ముగ్గురాయి నిల్వలు మరో రెండు నుంచి మూడు సంవత్సరాల్లో తగ్గిపోయే అవకాశం ఉండటంతో,భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ మైనింగ్ అవకాశాలను అన్వేషించాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లోని సులియారి బొగ్గు గనిని ఏపీఎండీసీ సొంతం చేసుకుంది. ఇప్పుడు దేశీయ గనులతో పాటు విదేశాల్లో ఉన్న అపార ఖనిజ నిక్షేపాలపై దృష్టి సారిస్తూ, అక్కడ ఖనిజ అన్వేషణ చేపట్టి మైనింగ్ లీజులు పొందాలనే ప్రణాళిక రూపొందిస్తోంది.
వివరాలు
విదేశీ మైనింగ్‌కు కేంద్రం ప్రోత్సాహం
ముఖ్యంగా ఆఫ్రికాలోని జింబాబ్వే, జాంబియా, నమీబియా, మొజాంబిక్, కాంగోతో పాటు దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, చిలీ, అలాగే ఆస్ట్రేలియాలో మైనింగ్ అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేయనుంది. విదేశాల్లో కీలక ఖనిజాల అన్వేషణ, మైనింగ్ కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోంది. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్‌సీఎంఎం) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలకు సహకారం అందుతోంది. గత ఏడేళ్లలో ఈ కార్యక్రమం కోసం దాదాపు రూ.34 వేల కోట్లు వెచ్చించారు. విదేశీ ఖనిజ అన్వేషణలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే జాతీయ ఖనిజ అన్వేషణ ట్రస్ట్ (ఎన్‌ఎంఈటీ) నుంచి కూడా మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ అవకాశాలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఏపీఎండీసీ విదేశీ మైనింగ్ వ్యూహాన్ని రూపొందిస్తోంది.
వివరాలు
విదేశీ మైనింగ్‌కు కేంద్రం ప్రోత్సాహం
ఈ ప్రక్రియలో భాగంగా స్ట్రాటజిక్, ట్రాన్స్‌మిషన్ అడ్వైజర్‌ను నియమించనుంది. ఏ దేశంలో ఏ ఖనిజాల తవ్వకాలకు అవకాశాలున్నాయి, వాటి ద్వారా ఏపీఎండీసీకి కలిగే ప్రయోజనాలు ఏమిటి వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించి తదుపరి కార్యాచరణ చేపట్టనుంది. ఇక కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన నాల్కో, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్), మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (ఎంఈసీఎల్) కలిసి ఏర్పాటు చేసిన ఖాంజీ బిదేశ్ ఇండియా లిమిటెడ్ (కాబిల్) విదేశాల్లో కీలక ఖనిజాల అన్వేషణ, మైనింగ్ ప్రాజెక్టుల సాధనపై దృష్టి సారిస్తోంది. ఈ సంస్థలో ఏపీఎండీసీకి కూడా భాగస్వామ్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
వివరాలు
ఏ దేశంలో ఏ ఖనిజాలు?
వివిధ దేశాల్లో లభ్యమయ్యే కీలక ఖనిజాలు, అక్కడి మైనింగ్ పరిస్థితులపై ఏపీఎండీసీ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. నమీబియా: లిథియం, యురేనియం, వెనేడియం, వజ్రాలు, రాగి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. భారత కేంద్ర గనులశాఖతో ఈ దేశ ప్రభుత్వానికి ఇప్పటికే అవగాహన ఒప్పందం అమల్లో ఉంది. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. జాంబియా: రాగి, కోబాల్ట్, గ్రాఫైట్, నికెల్ ఖనిజాలకు జాంబియా ప్రధాన కేంద్రంగా ఉంది. సుమారు 9 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని రాగి, కోబాల్ట్ బ్లాక్‌లను భారత ప్రభుత్వానికి కేటాయిస్తూ గత ఏడాది అక్టోబరులో ఒప్పందం కుదిరింది. అయితే అక్కడ మైనింగ్ చేపట్టాలంటే స్థానిక ప్రభుత్వానికి 30 శాతం భాగస్వామ్యం ఇవ్వాల్సి ఉంటుంది.
వివరాలు
ఏ దేశంలో ఏ ఖనిజాలు?
జింబాబ్వే: లిథియం, ప్లాటినం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిల్వలు విస్తారంగా ఉన్నాయి. ప్రపంచ లిథియం నిల్వల్లో సుమారు 20 శాతం జింబాబ్వేలోనే ఉన్నట్లు అంచనా. భారత్-ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశం-2025 సందర్భంగా మైనింగ్ సహకారంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. మొజాంబిక్: గ్రాఫైట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం, బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. మైనింగ్ రంగంలో భారత్ ఎగ్జిమ్ బ్యాంక్‌తో ఒప్పందం కుదిరింది. దేశ ఉత్తర ప్రాంతాన్ని మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో మైనింగ్ అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. కాంగో: ప్రపంచంలోనే అత్యధిక కోబాల్ట్ ఉత్పత్తి చేసే దేశంగా కాంగో నిలుస్తోంది. కోబాల్ట్‌తో పాటు రాగి, కోల్టాన్ ఖనిజాలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. ముఖ్యంగా కోబాల్ట్ మైనింగ్‌పై కాబిల్ ప్రత్యేక దృష్టి పెట్టింది.
వివరాలు
ఏ దేశంలో ఏ ఖనిజాలు?
చిలీ: రాగి, లిథియం నిక్షేపాలకు చిలీ ప్రసిద్ధి.అటకామా ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యధిక లిథియం నిల్వలు ఉన్నాయి. కీలక ఖనిజాల అభివృద్ధిపై భారత్,చిలీ మధ్య ఇప్పటికే ఒప్పందం ఉంది. అక్కడ లిథియం తవ్వకాల కోసం కాబిల్ సన్నాహాలు చేస్తోంది. బ్రెజిల్: నియోబియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం ఖనిజాలు,మాంగనీస్ నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి.బీచ్ శాండ్‌లో ఇల్మనైట్,రూటైల్ ఖనిజాలు లభిస్తాయి.భారత్-బ్రెజిల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్నప్పటికీ అమెజాన్ ప్రాంత పర్యావరణ నిబంధనలు కఠినంగా ఉండటం సవాలుగా మారే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా: రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, లిథియం,బీచ్ శాండ్,కోబాల్ట్, నికెల్ ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి.ఇప్పటికే భారత ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ అక్కడ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీంతో ఏపీఎండీసీకి కూడా అవకాశాలు అనుకూలంగా ఉండొచ్చని భావిస్తున్నారు.