Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అనంతపురం జిల్లా ఎల్లనూరు, వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం, లింగాల మండలాల్లో 150 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ హైబ్రిడ్ సిక్స్ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు 'ఏపీ సమీకృత శుద్ధ ఇంధన విధానం-2024' నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అనుమతులు ఇచ్చిన తేదీ నుంచి 24 నెలలలోపు పనులు పూర్తిచేయాలని షరతు విధించింది. దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని నెడ్‌క్యాప్ ఉపాధ్యక్షుడు,నిర్వహణాధికారికి ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
వివరాలు
అనుమతులు పొందిన మరికొన్ని ప్రాజెక్టులు, సంస్థలు
ఇతర ప్రాజెక్టులకు కూడా అనుమతులు లభించాయి. వైఎస్సార్ కడప జిల్లా లింగాల, పులివెందుల మండలాల్లో 150 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ హైబ్రిడ్ సెవెన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతి ఇచ్చారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో 175 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఎస్సార్ రెన్యువబుల్స్ హైబ్రిడ్ వన్ లిమిటెడ్ సంస్థకు అనుమతి మంజూరైంది. శ్రీ సత్యసాయి జిల్లా ఎన్‌పీ కుంట మండలంలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుతో పాటు 50 మెగావాట్ల సామర్థ్యం గల 120 మెగావాట్ గంటల శక్తి నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి పేస్ డిజిటెక్ లిమిటెడ్‌కు అనుమతి లభించింది.
వివరాలు
అనుమతులు పొందిన మరికొన్ని ప్రాజెక్టులు, సంస్థలు
కర్నూలు జిల్లా ఆలూరు సమీపంలో 300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు స్థాపనకు ఎస్సార్ రెన్యువబుల్స్ సోలార్ టూ లిమిటెడ్‌కు అనుమతి ఇచ్చారు. అదే మండలంలో 360 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుతో పాటు 220 మెగావాట్ల సామర్థ్యం గల 480 మెగావాట్ గంటల శక్తి నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఎస్సార్ రెన్యువబుల్స్ హైబ్రిడ్ వన్ లిమిటెడ్‌కు అనుమతి లభించింది. ఇక ఒక్కోటి 25 మెగావాట్ల సామర్థ్యం గల మొత్తం 200 మెగావాట్ల బయోమాస్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఎస్‌ఏఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. పశ్చిమ గోదావరి,కృష్ణా, తూర్పు గోదావరి, గుంటూరు, బాపట్ల, ఏలూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ సంస్థ ఎనిమిది యూనిట్లను ఏర్పాటు చేయనుంది.
వివరాలు
అనుమతులు పొందిన మరికొన్ని ప్రాజెక్టులు, సంస్థలు
తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలో సంవత్సరానికి ఒక కిలో టన్ను హరిత హైడ్రోజన్ ఉత్పత్తి చేసే కేంద్రం ఏర్పాటు కోసం హెచ్‌హెచ్‌పీ 8 ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతి ఇచ్చారు. అదనంగా, కొన్ని సంస్థలకు రాష్ట్ర శుద్ధ ఇంధన విధానం కింద ప్రోత్సాహకాలు అందించేందుకు కూడా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.