
APSDMA: రాగల 3 గంటల్లో పిడుగులతో వర్షాలు.. ఏపీలో ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు గంటల పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ప్రజలు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వివరాల ప్రకారం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశాలున్నందున ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా, అక్కడి ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.
వివరాలు
చెట్ల కింద నిలబడవద్దని ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ సూచన
అదేవిధంగా, శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, పిడుగులతో పాటు వచ్చే అవకాశాలపై ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తిరుపతి, కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు ఉండే అవకాశం ఉందని, అందువల్ల ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించినట్లు తెలిపారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల సంరక్షకులు వెంటనే భద్రమైన భవనాల్లోకి వెళ్లాలని ప్రఖర్ జైన్ సూచించారు. వర్షకాలంలో చెట్ల కింద నిలబడటం, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండటం అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.