APSRTC: ఇక గూగుల్ మ్యాప్స్ ద్వారానే ఏపీఎస్ఆర్టీసీ బస్సు టికెట్ల బుకింగ్ సౌకర్యం!
ఈ వార్తాకథనం ఏంటి
ఎక్కడికైనా వెళ్లాలన్నా, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయడం సులభమైన మార్గం, దూరం, ప్రయాణ సమయం వంటి వివరాలు తెలుసుకోవడం చాలా మందికి అలవాటుగా మారింది. ఇకపై అదే గూగుల్ మ్యాప్స్‌లో నుంచే బస్సు టికెట్లు కూడా బుక్ చేసుకునే అవకాశం రానుంది. ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు గూగుల్ మ్యాప్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కలిసి పనిచేయనున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రయాణికులు నేరుగా గూగుల్ మ్యాప్స్ నుంచే ఏపీఎస్ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం పొందనున్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీ టికెట్లు కౌంటర్ల ద్వారా, ఏజెంట్ల ద్వారా, అధికారిక వెబ్‌సైట్ లేదా ఇతర యాప్‌ల ద్వారా మాత్రమే బుక్ చేయగలిగేవారు.
Details
బుకింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
అయితే, త్వరలో గూగుల్ మ్యాప్స్ కూడా ఈ జాబితాలో చేరనుంది. ఉదాహరణకు — ఎవరు గూగుల్ మ్యాప్స్‌లో విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు వెళ్లాలనుకుని సెర్చ్ చేస్తే, ఇప్పటి వరకు కనిపించే కారు, బైక్, రైలు, నడక మార్గాలతో పాటు ఇప్పుడు బస్సు ప్రయాణ వివరాలు కూడా చూపబడతాయి. యూజర్ బస్ సింబల్‌పై క్లిక్ చేస్తే, ఆ మార్గంలో నడిచే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల వివరాలు, బయలుదేరే సమయం, గమ్యస్థానానికి చేరుకునే సమయం వంటి సమాచారంతో కనిపిస్తాయి. అంతేకాకుండా, యూజర్ తనకు నచ్చిన బస్సును ఎంపిక చేసుకుని బుకింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, అది నేరుగా ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది.
Details
ఆర్టీసీ సేవలు మరింత సులభతరం
అక్కడ ప్రయాణికుడు తన వివరాలు నమోదు చేసి, ఆన్‌లైన్ చెల్లింపు ద్వారా సులభంగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ విధానాన్ని ఇప్పటికే సుమారు మూడు నెలల క్రితం విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఆ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఈ సదుపాయాన్ని విస్తరించే పనిలో ఏపీఎస్ఆర్టీసీ ఉన్నట్లు సమాచారం. దీంతో, ప్రయాణికులు ఇక గూగుల్ మ్యాప్స్ ద్వారానే బస్సు వివరాలు తెలుసుకుని, వెంటనే టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం పొందనున్నారు. ఇది ఆర్టీసీ సేవలను మరింత ఆధునికంగా, సులభతరంగా మార్చబోతుందనే చెప్పాలి.