APSRTC: పీఎస్‌ఆర్టీసీకి మరో 1,450 విద్యుత్ బస్సులు.. స్వచ్ఛ రవాణా దిశగా ముందడుగు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీఎస్‌ఆర్టీసీ మరిన్ని విద్యుత్ బస్సులను తీసుకురావడానికి సిద్ధమైంది. తాజాగా 1,450 విద్యుత్ బస్సుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సుస్థిర విద్యుత్ వాహన విధానం (4.0)లో భాగంగా, ప్రస్తుతం సంస్థ వద్ద ఉన్న 8,375 డీజిల్ బస్సులను 2031 నాటికి దశలవారీగా విద్యుత్ బస్సులతో మార్చాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఈ-బస్ సేవా పథకం కింద రాష్ట్రానికి 1,050 విద్యుత్ బస్సులను కేటాయించింది. వీటిలో 11 నగరాల కోసం 750 బస్సులు, తిరుమల-తిరుపతి ఘాట్ మార్గంలో నడిపేందుకు 300 బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల సరఫరా కోసం కేంద్రం టెండర్లు పిలిచి, పినాకిల్ ఇండియా లిమిటెడ్ సంస్థను ఎంపిక చేసింది.
వివరాలు
కొత్తగా తీసుకునే బస్సులు 8.5 అడుగుల వెడల్పు
ఇప్పుడు కొత్తగా తీసుకోనున్న 1,450 బస్సుల కోసం మాత్రం ఏపీఎస్‌ఆర్టీసీ స్వయంగా టెండర్లు పిలవనుంది. ప్రభుత్వం-ప్రైవేటు భాగస్వామ్య విధానంలో, స్థూల వ్యయ ఒప్పంద పద్ధతిలో అద్దె ప్రాతిపదికన ఈ బస్సులను పొందనున్నారు. కేంద్రం కేటాయించిన బస్సుల వెడల్పు 8 అడుగులు మాత్రమే ఉండటం వల్ల సీట్ల సంఖ్య పరిమితంగా ఉంటుంది. అయితే కొత్తగా తీసుకునే బస్సులు 8.5 అడుగుల వెడల్పుతో ఉండేలా నిర్ణయించడంతో, ప్రయాణికులకు ఎక్కువ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
వివరాలు
విశాఖ - భోగాపురం మధ్య ప్రత్యేక సేవలు
విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు విద్యుత్ బస్సుల సేవలను ప్రారంభించేందుకు ఆర్టీసీ ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రారంభ దశలో 20 గాలినియంత్రిత విద్యుత్ బస్సులను నడపాలని నిర్ణయించింది. జూన్ చివరినాటికి విమానాశ్రయం ప్రారంభం కానుండగా, అప్పటి నుంచే షటిల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేస్తున్నారు.
వివరాలు
సీఎన్‌జీ బస్సులపై దృష్టి
విద్యుత్ బస్సులతో పాటు, సీఎన్‌జీ బస్సుల వినియోగాన్ని పెంచేందుకు కూడా ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. స్త్రీశక్తి పథకం అమలుతో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో పాటు, 15 ఏళ్లు దాటిన పాత బస్సులను మార్చాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వెంటనే 500 సీఎన్‌జీ బస్సులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదేవిధంగా ఇప్పటికే ఎక్కువ దూరం ప్రయాణించిన 500 డీజిల్ బస్సులను మార్పులు చేసి, వాటిలో సీఎన్‌జీ పరికరాలను అమర్చనున్నారు. రాష్ట్రంలో భాగ్యనగర్ గ్యాస్, మేఘా, గోదావరి గ్యాస్, థింక్ గ్యాస్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ వంటి సంస్థలు వివిధ జిల్లాల్లో సీఎన్‌జీ సరఫరా చేస్తున్నాయి. ఆయా సంస్థల సరఫరా సామర్థ్యాన్ని పరిశీలించి, అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు.
వివరాలు
ఆర్టీసీ రోజుకు సుమారు 7.5 లక్షల లీటర్ల డీజిల్ వినియోగం
సాధారణంగా ఒక బస్సు రోజుకు సుమారు 400 కిలోమీటర్లు ప్రయాణిస్తుండగా, దానికి 70-80 కిలోల గ్యాస్ అవసరం అవుతోంది. ప్రస్తుతం ఆర్టీసీ రోజుకు సుమారు 7.5 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోంది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం వల్ల చిల్లర ధరల కంటే లీటర్‌కు రూ.6-7 తక్కువకు డీజిల్ లభిస్తోంది. అదే విధంగా సీఎన్‌జీ ధరను కూడా కిలోకు రూ.4-5 వరకు తగ్గించాలని ఆర్టీసీ సంస్థలు కోరుతోంది. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి.