Cm chandrababu: ఫిబ్రవరి 15 తర్వాత ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన: సీఎం చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు ఫిబ్రవరి 15 తర్వాత శంకుస్థాపన నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణతో పాటు అవసరమైన అన్ని అనుమతుల ప్రక్రియను అప్పటిలోగా పూర్తిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. దావోస్‌లోని ఏపీ లాంజ్‌లో ఆర్సెలార్ మిత్తల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిత్తల్, సీఈవో ఆదిత్య మిత్తల్‌లతో సీఎం సమావేశమయ్యారు. ఉక్కు పరిశ్రమ స్థాపనకు వివిధ దశల్లో కావాల్సిన అనుమతులపై మిత్తల్‌ల సమక్షంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు నారా లోకేశ్, టీ.జీ. భరత్ పాల్గొన్నారు.
వివరాలు
తొలి దశలో సంస్థ రూ.60 వేల కోట్ల పెట్టుబడి
సమావేశంలో సీఎం మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా ప్లాంటు నిర్మాణాన్ని పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలని సూచించారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, ప్రభుత్వ సహకారం విషయంలో ఎలాంటి ఆలస్యం ఉండదని స్పష్టం చేశారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ అనుమతులను వేగంగా తీసుకొచ్చేందుకు మంత్రులు లోకేశ్, భరత్‌లు ఢిల్లీకి వెళ్లి బాధ్యత తీసుకుంటారని తెలిపారు. తొలి దశలో సంస్థ రూ.60 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సీఎం పేర్కొన్నారు. ప్లాంటు నిర్మాణానికి సంబంధించి మంత్రి లోకేశ్ నిరంతరం తమతో సంప్రదింపులు జరుపుతున్నారని సీఈవో ఆదిత్య మిత్తల్ తెలిపారు. అలాగే రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి వివరించారు.