Vande Mataram: జాతీయ గీతంగా వందే మాతరం ఎందుకు వద్దన్నారు? నెహ్రూ లేఖలోని సంచలన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా సోమవారం పార్లమెంట్‌లో దాదాపు 10 గంటలపాటు ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ సందర్భంగా తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పాత్రపై బీజేపీ చర్చకు తెరలేపింది. చర్చలో భాగంగా "నిజం బయట పెట్టేందుకే ఈ చర్చ" అని బీజేపీ నేతలు చెబుతున్నారు. లోక్‌సభలో ప్రభుత్వ తరఫున చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించనుండగా, వందే మాతరం గీతంలోని కొన్ని చరణాలను కాంగ్రెస్ కావాలనే తొలగించి, మత ప్రాతిపదికన దేశాన్ని విడదీసే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. దీనికి ప్రతిగా, 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీర్మానం చేసిన నాయకులను అవమానిస్తున్నారని ప్రతిపక్షాలు మోదీపై విమర్శలు చేశాయి.
వివరాలు
జాతీయ గీతానికి మాటల కంటే సంగీతమే ప్రధానం
ఈ నేపధ్యంలో నెహ్రూ నిజంగా వందే మాతరాన్ని జాతీయ గీతంగా తీసుకోవడాన్ని వ్యతిరేకించారా? ఎందుకు వ్యతిరేకించారు? అన్న చర్చ మొదలైంది. నెహ్రూ ఆర్కైవ్స్‌లోని పలు లేఖలు,కేబినెట్ నోట్లు పరిశీలిస్తే ఆయన వందే మాతరం జాతీయ గీతంగా సరిపోదనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. 1948 మే 21న ఇచ్చిన ఓ నోట్లో నెహ్రూ, జాతీయ గీతానికి మాటల కంటే సంగీతమే ప్రధానమని, విదేశాల్లో వాయిద్య బృందాలు వాయించడానికి అనుకూలంగా ఉండాలని, ఆ లక్షణాలు 'జన గణ మన'లో ఉన్నాయని రాశారు. వందే మాతరం సంగీతం బాధతో నిండిపోయినట్టుగా, మెల్లగా, పునరావృతంగా ఉండి బ్యాండ్లకు సరిపోదని, విదేశీయులకు అర్థం కావడం మరింత కష్టమని అభిప్రాయపడ్డారు.
వివరాలు
సంగీతం వాయిద్య బృందాలకు సరిపోని వందే మాతరం
జూన్ 15, 1948న బీసీ రాయ్‌కు రాసిన లేఖలో వందే మాతరం స్వాతంత్ర్య పోరాటానికి ప్రతీక అని, కానీ జాతీయ గీతం విజయాన్ని, సాధనను ప్రతిబింబించాలి తప్ప పోరాట కాలపు వేదనను కాదని పేర్కొన్నారు. అలాగే 1948 జూన్ 21న శ్యామా ప్రసాద్ ముఖర్జీకి రాసిన లేఖలోనూ వందే మాతరం సంగీతం వాయిద్య బృందాలకు సరిపోదని, ఇప్పటికే 'జన గణ మన'కు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి గుర్తింపు ఉందని నెహ్రూ పేర్కొన్నారు.
వివరాలు
అవసరమైతే కొత్త గీతం లేదా కొత్త సంగీతం
రాజ్యాంగ సభలోనూ నెహ్రూ ఇదే స్పష్టం చేస్తూ - వందే మాతరం భారతదేశపు అగ్రశ్రేణి జాతీయ గీతంగా శాశ్వతంగా నిలుస్తుందని, అయితే జాతీయ ఆత్మగీతంగా జన గణ మన సంగీతమే అంతర్జాతీయ వేదికలపై ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై తుది నిర్ణయం రాజ్యాంగ సభకే వదిలేస్తూ, అవసరమైతే కొత్త గీతం లేదా కొత్త సంగీతం కూడా తీసుకోవచ్చని అప్పట్లో నెహ్రూ తెలియజేశారు.