Tirumala Laddu: కల్తీ నెయ్యి విషయంలో 'టెండరు' ప్రమాణాలు పాటించట్లేదా?
తిరుమలలో నెయ్యి సరఫరా, నాణ్యతపై సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. సోమవారం సిట్ బృందం పలు కీలక వివరాలను పరిశీలించినట్లు తెలిసింది. సిట్ బృందం, నెయ్యి సరఫరా టెండర్ల ప్రక్రియలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా, ల్యాబ్ పరీక్షలు నిర్వహించారా అన్న అంశాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా నెయ్యిలో జంతు కొవ్వు, వనస్పతి వంటి కల్తీ పదార్థాలు ఉంటే గుర్తించేందుకు సరైన పరికరాలు ఉన్నాయా అన్న ప్రశ్నలను ల్యాబ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నెయ్యి కొనుగోలు నుంచి వినియోగం దాకా అన్ని అంశాలపై సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగించారు.
దర్యాప్తును ముమ్మరం చేసిన సిట్
సిట్ బృందం క్షేత్రస్థాయిలో దర్యాప్తును ముమ్మరం చేస్తూ, గిడ్డంగులు, ల్యాబ్‌లు, నెయ్యి శాంపిళ్ల సేకరణ, పరీక్షా విధానాలు, సరఫరా వ్యవస్థపై ఆరా తీశారు. నెయ్యి ట్యాంకర్ల రాకపోకల వివరాలు, ట్యాంకర్లను తిరస్కరించిన సందర్భాల్లో తీసుకున్న చర్యలను కూడా పరిశీలించారు. సిబ్బందితో సమావేశం అవుతూ, లడ్డూ తయారీ సిబ్బంది నుంచి నెయ్యి నాణ్యత పై ఫిర్యాదుల వివరాలు సేకరించారు. సిట్ బృందం మంగళవారం ఏఆర్ డెయిరీకి కూడా వెళ్లి దర్యాప్తును కొనసాగించనుంది. దాదాపు కల్తీ ఆరోపణలతో సంబంధిత డెయిరీ సంస్థను సమీక్షించనున్నారు.