Andhra pradesh: అర్జున అవార్డు గ్రహీత సాకేత్‌కు ప్రభుత్వ గౌరవం.. డిప్యూటీ కలెక్టర్‌గా నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
అర్జున అవార్డు అందుకున్న టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్‌కు రాష్ట్ర ప్రభుత్వం క్రీడల కోటా కింద ఎన్టీఆర్ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా నియామకం ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నగరంలోని కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లిన సాకేత్, జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశను కలుసుకుని తన జాయినింగ్ రిపోర్టును సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ, ఏషియన్ గేమ్స్‌తో పాటు పలు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ టెన్నిస్ పోటీల్లో మైనేని సాకేత్ పతకాలు సాధించి దేశానికి గౌరవం తీసుకువచ్చారని తెలిపారు. ఇలాంటి ప్రతిభావంతులైన క్రీడాకారులు మరింత ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని పేర్కొన్నారు.
వివరాలు
ఏటీపీ ఛాలెంజర్ టూర్‌లో పాల్గొనేందుకు ఐరోపా పర్యటన
భవిష్యత్తులో కూడా సాకేత్ మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో విజయం సాధించి దేశానికి పేరు ప్రతిష్ఠలు తెచ్చాలని ఆకాంక్షించారు. జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని కూడా కలెక్టర్ స్పష్టం చేశారు. అదే సమయంలో వచ్చే వారంలో నిర్వహించనున్న ఏటీపీ ఛాలెంజర్ టూర్‌లో పాల్గొనేందుకు ఐరోపా పర్యటనకు వెళ్లనున్నట్లు సాకేత్ కలెక్టర్‌కు తెలియజేశారు. దీనిపై కలెక్టర్ లక్ష్మీశ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పోటీల్లో మంచి ఫలితాలు సాధించాలని అభిలషించారు.