Loading...
Army: సైన్యానికి ప్రత్యేక కమ్యూనికేషన్‌ శాటిలైట్‌.. ఎప్పుడంటే?
సైన్యానికి ప్రత్యేక కమ్యూనికేషన్‌ శాటిలైట్‌.. ఎప్పుడంటే?

Army: సైన్యానికి ప్రత్యేక కమ్యూనికేషన్‌ శాటిలైట్‌.. ఎప్పుడంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత సైన్యానికి ప్రత్యేకంగా రూపొందిస్తున్న తొలి కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్‌-7బీని 2028 మధ్యలో ఇస్రో ప్రయోగించనుంది. సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగం ఆరు నెలలు ఆలస్యం కానుందని ఉన్నతాధికారులు సోమవారం వెల్లడించారు. తొలుత ఈ ఉపగ్రహాన్ని 2027 నవంబర్‌లో ప్రయోగించాలని భావించారు. సుమారు ఐదు టన్నుల బరువున్న ఈ ఉపగ్రహం ద్వారా మారుమూల సరిహద్దు ప్రాంతాల్లోనూ సైనికులకు నిరంతరాయంగా,సురక్షితమైన సమాచార వ్యవస్థ అందుబాటులోకి రానుంది. కష్టతరమైన భౌగోళిక పరిస్థితుల్లోనూ సైనిక కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించడంతో పాటు యుద్ధ సమయంలో సైనిక బలగాల మధ్య సమన్వయం,కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను బలోపేతం చేయనుంది. ఇప్పటివరకు భారత సైన్యానికి ప్రత్యేక కమ్యూనికేషన్ ఉపగ్రహం లేదు. ప్రస్తుతం వైమానిక దళానికి చెందిన జీశాట్‌-7ఏ ఉపగ్రహంపై ఆధారపడుతోంది.

వివరాలు 

సైనిక సమాచార వ్యవస్థకు బలం.. వైమానిక దళానికీ కొత్త ఉపగ్రహం

ఈ అవసరాన్ని తీర్చేందుకు 2023 మార్చిలో రక్షణ మంత్రిత్వ శాఖ ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌)తో రూ.3,000కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది.

భూ ఆధారిత సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నా,శత్రువుల దాడులతో అంతరాయాలు ఏర్పడినా ఉపగ్రహ ఆధారిత సమాచార వ్యవస్థలు కీలకంగా మారనున్నాయి.

చైనా తన అంతరిక్ష సామర్థ్యాలను వేగంగా పెంచుకుంటున్న నేపథ్యంలో శత్రువుల ఉపగ్రహ సంకేతాలను అడ్డుకునే సాంకేతికతలపైనా భారత్‌ దృష్టి సారిస్తోంది.

మరోవైపు,భారత వైమానిక దళం కోసం జీశాట్‌-7సీ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసేందుకు గత వారం రక్షణ మంత్రిత్వ శాఖ ఎన్‌ఎస్‌ఐఎల్‌తో రూ.2,563కోట్ల ఒప్పందం చేసుకుంది.

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించే ఈ ఉపగ్రహం ద్వారా వైమానిక దళానికి చెందిన విమానాలు,ఇతర వ్యవస్థలకు సురక్షితమైన, నిరంతర సమాచార సేవలు అందనున్నాయి.

వివరాలు 

అంతరిక్ష రక్షణపై భారత్‌ ఫోకస్‌.. మూడేళ్లలో 52 సైనిక ఉపగ్రహాలు

ఇప్పటికే భారత నౌకాదళం కోసం రూపొందించిన జీశాట్‌-7ఆర్‌ ఉపగ్రహాన్ని ఇస్రో గత ఏడాది నవంబర్‌లో ప్రయోగించింది.

ఇది యుద్ధనౌకలు, విమానాలు, జలాంతర్గాములు, సముద్ర కార్యకలాపాల కేంద్రాల మధ్య సురక్షిత సమాచార మార్పిడికి ఉపయోగపడుతోంది.

దేశ రక్షణలో అంతరిక్ష వ్యవస్థల ప్రాధాన్యాన్ని గుర్తించిన భారత్‌ గత ఏడాది సెప్టెంబర్‌లో జాయింట్‌ మిలిటరీ స్పేస్‌ డాక్ట్రిన్‌ను విడుదల చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

అంతరిక్ష రక్షణపై భారత్‌ ఫోకస్‌.. మూడేళ్లలో 52 సైనిక ఉపగ్రహాలు

అంతరిక్ష రంగంలో ఎదురవుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు జాతీయ సైనిక అంతరిక్ష విధానాన్ని కూడా రూపొందిస్తోంది.

అంతేకాకుండా, అంతరిక్ష ఆధారిత నిఘా వ్యవస్థ (ఎస్‌బీఎస్‌) మూడో దశలో భాగంగా వచ్చే మూడేళ్లలో 52 సైనిక ఉపగ్రహాలను ప్రయోగించాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

2024 అక్టోబర్‌లో భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ రూ.26,968 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.

ఇందులో భాగంగా ఇస్రో 21 ఉపగ్రహాలను తయారు చేసి ప్రయోగించనుండగా, మిగిలిన 31 ఉపగ్రహాల బాధ్యతను ప్రైవేటు సంస్థలు చేపట్టనున్నాయి.

ADVERTISEMENT